ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ  తెలంగాణ పర్యటన ఖరారైన నేపథ్యంలో అతడిపై మాజీ మంత్రి హరీష్ ఫైర్ అయ్యారు. ఇంకా ఏం మొఖం పెట్టుకుని రాహుల్ తెలంగాణలో పర్యటించడానికి వస్తున్నారని విమర్శించారు. కేవలం తెలంగాణ ప్రజలనే కాదు యావత్ దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రాహుల్ గాంధీ కుటుంబం ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. 

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా హరీష్ మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపుకోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన పఠాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ తెలంగాణలోని వృద్దులు, వితంతువులకు పెద్దకొడుకుగా వ్యవహరిస్తున్నాడన్నారు. వీరిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ  ఇప్పటివరకు నెల నెల పించను అందిస్తున్నారన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో నెరవేస్తూ మరికొద్ది రోజుల్లో పెన్షన్ నగదును పెంచనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా వృద్దుల ఫెన్షన్ అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గించామని గుర్తుచేశారు. వచ్చే నెల నుండే ఇలా అర్హత కలిగిన వృద్దులందరికి పెన్షన్లు అందనున్నాయని హరీష్ వెల్లడించారు.    

దాదాపు 72 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని విమర్శించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ  1971లో గరీబీ హఠావో నినాదాన్నిచ్చి పేదరికాన్ని నిర్మూలిస్తానన్నారని...ఇప్పుడు ఆమె మనువడు రాహుల్ కూడా ఇప్పటికీ అదే మాట చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. పేదలను కేవలం వారు ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని... ఇలా అప్పటినుండి ఇప్పటివరకు వారు చెప్పిందంతా మోసమేనన్నారు. దీనిపై పేదలకు సమాధానం చెప్పిన తర్వాతే రాహుల్ ఓట్లు అడగాలని హరీష్ డిమాండ్ చేశారు.