నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి గత ఐదేళ్ళ కాలంలో కేంద్ర ప్రభుత్వం అదనంగా ఒక్క పైసా ఇవ్వలేదని మాజీ  మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నిధుల కోసం సీఎం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఎంపీకి మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి లాక్కుని యావత్ తెలంగాణను అవమానించారని హరీష్ బిజెపి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న హరీష్ నర్సాపూర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మెదక్ లోక్ సభ స్థానంలో గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధికి  ఇచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీని టీఆర్ఎస్ అభ్యర్థికి అందించాలన్నారు. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ఆ దిశగా ప్రచారం నిర్వహించి మరోసారి పార్టీ గెలుపుకు కృషి చేయాలని హరీష్ సూచించారు. 

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఈ లోక్ సభ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా లభించే పరిస్థితులు లేవన్నారు. ఆ పార్టీ పరిస్థితి ఓటమికి తక్కువ, డిపాజిట్ కు ఎక్కువ అన్నట్లు తయారయ్యిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో బతుకుదెరువు కోల్పోయిందని హరీష్ ఎద్దేవా చేశారు. 

టీఆర్ఎస్ పార్టీ రైతుమ సంక్షేమ పాలన సాగిస్తోందని...దాన్ని చూసే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు నడుస్తున్నారని తెలిపారు. ఇప్పటికు దాదాపు ఖాళీ అయిపోయిన ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల తర్వాత ఉనికినే కోల్పోయే ప్రమాదంలో వుందని హరీష్ తెలిపారు.