దేశవ్యాప్తంగా ఈవీఎంల టాంపరింగ్, వాటి పనితీరుపై చర్చనడుస్తున్న సమయంలో జగిత్యాల జిల్లాలో ఈవీఎంల తరలింపు రాజకీయంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల తహసీల్దార్ కార్యాలయం నుంచి మిని స్టేడియంలో ఉన్న గోడౌన్‌కు సోమవారం రాత్రి ఆటోలో 10 ఈవీఎంలను తరలించారు.

అయితే ఆ సమయంలో గౌడౌన్‌కు తాళం వేసి వుండటంతో వాటిని తిరిగి తహసీల్దార్ కార్యాలయానికే తీసుకొచ్చారు. ఇప్పటికే పోలింగ్ సమయంలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురైయ్యాయంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

తాజాగా జగిత్యాలలో అధికారులు ఈవీఎంలను ఎందుకు తరలించారు అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. వీటిపై స్పందించిన అధికారులు ఎన్నికల సిబ్బందికి అవగాహన కోసం ఉంచిన ఈవీఎంలనే గోడౌన్‌కు తరలించినట్లుగా చెబుతున్నారు.

కాగా రెండు రోజుల క్రితం కూడా కారులో కొన్ని ఈవీఎంలను గౌడౌన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ రెండు వివాదాలు జగిత్యాలలో చర్చకు దారి తీశాయి. వీటిని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ విచారణకు ఆదేశించారు.