మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ ను ఈ లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్కనపెట్టిన విషయం తెలిసిందే. వివిధ కారణాల దృష్ట్యా అతడి స్థానంలో మరో గిరిజన నాయకురాలు మాలోతు కవిత కు అవకాశం కల్పించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన కూడా వెలువడింది. దీంతో ఎంపీ సీతారాం నాయక్ తో పాటు కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. 

అయితే పార్టీ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించకున్నా... తనకు అన్యాయం జరిగిందని సీతారాం నాయక్ సన్నిహితుల వల్ల వాపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అతన్ని ఓదార్చి టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిచ్చేలా నచ్చజెప్పడాకి స్థానిక మంత్రి  ఎర్రబెల్లి దయాకరరావు రంగంలోకి దిగారు. సీతారాం నాయక్ ఇంటికి వెళ్లి మరోసారి అవకాశం రాకపోవడంతో బాధలో మునిగిపోయిన ఆయన్ని, కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. 

ఈ సందర్భంగా ఆయన కుటుంబం మంత్రి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. టీఆర్ఎస్ పార్టీనే నమ్ముకున్న తమ కుటుంబానికి అన్యాయం  జరిగిందని  మంత్రి వాళ్లు ఆవేధనను వ్యక్తం చేశారు. 

అనంతరం ఎర్రబెల్లి దయాకరరావు సీతారాం నాయక్  తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం జరగదని...మీకు తగిన విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేస్తారని ఎర్రబెల్లి నచ్చజెప్పారు. రానున్న రోజుల్లో సముచిత స్థానాన్ని కట్టబెట్టే ఆలోచనలో కెసిఆర్  ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పూర్తి మద్దతిచ్చి గెలిపించుకోవాలని ఆయనకు మంత్రి సూచించారు.