మహబూబ్ నగర్‌ లోక్ సభ  స్థానంపై బిజెపి జెండా ఎగరేయాలని డికె అరుణ విశ్వప్రయత్నం చేశారు. కానీ అనూహ్యంగా ఆమె టీఆర్ఎస్ అభ్యర్ధి మన్నె శ్రీనివాస్ రెడ్డి  చేతిలో ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. అయితే తన ఓటమికి గల  కారణాలను విశ్లేషించుకున్న ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. తాము అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే ఓట్లను అధికంగా సాధించామని...గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. కేవలం గ్రామీణ ప్రజలకు పార్టీని చేరువ చేయలేకపోవడం వల్లే తాను ఓడిపోవాల్సి వచ్చిందని అరుణ అభిప్రాయపడ్డారు. 

తాను గెలవలేకపోయానన్న బాధ కంటే దేశవ్యాప్తంగా బిజెపి బంపర్ మెజారిటీతో గెలిచిందన్న ఆనందమే ఎక్కువగా వుందన్నారు. దేశ ప్రజలతో పాటు బిజెపికి నాలుగు సీట్లు అందించిన రాష్ట్ర ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. దేశ భద్రత కేవలం మోదీ వల్లే సాధ్యమని భావించిన ప్రజలు బిజెపికి బంపర్ మెజారిటీని అందించినట్లు పేర్కొన్నారు. తాను ప్రత్యక్షంగా ఓడిపోయినప్పటికి నైతికంగా గెలిచానని డికె అరుణ అన్నారు. 

తెలంగాణ లో టీఆర్ఎస్ కు ఎప్పటికైనా  ప్రత్యామ్నాయం బిజెపి పార్టీయే అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని భవిష్యత్ లేని పార్టీగా ఆమె అభివర్ణించారు. కరీంనగర్, నిజామాబాద్  లలో టీఆర్ఎస్ ఓటమికి కేసీఆరే కారణమని...ఇందుకు ఆయన నైతికబాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.  తాను ఓటమిపాలైన ఈ ఐదేళ్లపాటు ప్రజల మధ్యే వుంటూ వారి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడతానని డికె అరుణ  తెలిపారు.