మరో నెలరోజుల్లో జరగనున్న ఎన్నికలకోసం సైబరాబాద్ పరిధిలో లోక్ సభ స్థానాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేయనున్నట్లు సిపి సజ్జనార్ వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు, పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని...అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా జాగ్రత్త పడుతున్నట్లు సిపి తెలిపారు. 

ప్రతి పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమల్లో వుంటుందని...నాయకులు, ప్రజలు దీన్ని దృష్టిలో వుంచుకుని పోలీసులకు సహకరించాలన్నారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు పార్టీ కార్యాలయాలు, ప్రచార కార్యక్రమాలు వుండకూడదని సూచించారు. అలా ఎన్నికల నియమావళిని ఉళ్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

లోక్ సభ పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ఓ ఏసిపి ని ఇంచార్జిగా నియమించనున్నట్లు తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి అక్రమంగా తరలించే మద్యం, నగదు ప్రవాహాన్ని అడ్డుకోడానికి ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటుచేస్తామన్నారు. అలాగే రౌడీషీటర్లు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా వుంచనున్నట్లు పిసి తెలిపారు.