హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలనుంది. ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు వరుసగా గుడ్ బై చెప్తున్న తరుణంలో తాజాగా మరో కీలక నేత గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

మాజీమంత్రి డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ డీకే అరుణను మంగళవారం కలిశారు. 

రామ్ మాధవ్ ఆమెతో దాదాపుగా 45 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడించినట్లు సమాచారం. రాజకీయపరంగా ఆమెకు మంచి భవిష్యత్ ఇస్తానని అమిత్ షా హామీ ఇచ్చారని తెలుస్తోంది. 

అమిత్ షా హామీతో ఆమె ఢిల్లీ పయనమయ్యారు. బుధవారం అమిత్ షా సమక్షంలో డీకే అరుణ బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఆమె మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ప్రచారం కూడా జరుగుతోంది.  

కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కార్తీక్ రెడ్డి మంళవారం శంషాబాద్ లోని టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. సబిత త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు.

మరోవైపు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సైతం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. లింగయ్య బుధవారం సాయంత్రం 4గంటలకు టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా వరుసగా కీలక నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తుండటంతో పార్టీలో గందరగోళం నెలకొంది.