లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాజకీయాలు రసత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే టిడిపి పార్టీలో బలమైన నాయకులు, ప్రతిపక్షాల ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో వున్న నామా నాగేశ్వర రావు ను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఇలా ఆయన గులాబీ పార్టీలో చేరడంతో ఖమ్మం రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే దీనిపై వెంటనే స్పందించిన కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్ధిని కూడా ప్రకటిస్తూ దూకుడును ప్రదర్శించింది. 

కాంగ్రెస్ పార్టీ నుండి ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా మాజీ ఎంపి రేణుకా చౌదరి బరిలోకి దిగనున్నారు. లోక్ సభ టికెట్ విషయంలో ఆమెకు పోటీగా వున్న నామా  టీఆర్ఎస్ లో చేరడంలో రేణుకా చౌదరికి అడ్డంకి తొలగిపోయింది. దీంతో ఆమెను తమ పార్టీ ఎంపీ అభ్యర్థిగా  కాంగ్రెస్ ప్రకటించింది. 

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 16 స్థానాల్లో సత్తా చాటి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యప్తంగా టీఆర్ఎస్ హవా కొనసాగినా ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం ఎదురుగాలి వీచింది. దీంతో ఆ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆ జిల్లాకు చెందిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ వైపు ఆకర్షించడంలో సఫలమయ్యారు. 

అయితే ప్రస్తుతం ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీఆర్ఎస్ అదిష్టానం అసంతృప్తితో వుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు ను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించి  అతన్ని ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీలోకి దించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇలా నామా టీఆర్ఎస్ లో చేరడంతో ఖమ్మం నుండి రేణుక అభ్యర్థిత్వం ఖరారయ్యింది. 

ఈ క్రమంలో ఖమ్మంలో పార్లమెంట్ స్థానంలో ఫోటీ ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు ... కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి ఇద్దరూ జిల్లాలో బలమైన నేతలుగా మంచి పేరుంది. అంతేకాకుండా వీరిద్దరు ఒకే(కమ్మ) సామాజికవర్గానికి చెందిన నేతలు కావడంతో ఈ పోరు మరింత ఉత్కంఠ రేపుతోంది.