తెలంగాణ కాంగ్రెస్ గత అసెంబ్లీ  ఎన్నికల నుండి ఎన్నికల కోసం ఉపయోగిస్తున్న ఈవీఎం లపై అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం కొనసాగుతున్న లోక్ సభ పోలింగ్ లో ఉపయోగిస్తున్న ఈవీఎంలపై కూడా కాంగ్రెస్ నాయకులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఈవీఎంలను అధికార పార్టీకి అనుకూలంగా సెట్ చేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఇదే అనుమానాన్ని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తం చేశారు. 

నల్గొండ పబ్లిక్ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. భువనగిరి లోక్ సభ పరిధిలోని దాదాపు పది పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు అనుమానాస్పదంగా వున్నట్లు దన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇక్కడ ఏ పార్టీకి ఓటేసిని వివిప్యాట్ మిషన్లలో కారు గుర్తునే చూపిస్తోందని ఓటర్లు చెబుతున్నారని అన్నారు. దీంతో ఓట్లన్ని టీఆర్ఎస్ పార్టీకే పడుతున్నట్లు తమకు అనుమానంగా వుంందన్నారు.

దీనిపై ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వెంటనే ఆయా బూతుల్లో పోలింగ్ నిలిపివేసి ఈవీఎంలను మార్చడంగానీ...తర్వాత పోలింగ్ నిర్వహించడం గానీ చేయాలని డిమాండ్ చేశారు. మిగతా కొన్ని చోట్ల కూడా ఈవీఎం ల పనితీనుపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు..