నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను తమ సొంత కుటుంబ సభ్యుడిగా భావించి అతడి రాజకీయ ఎదుగుదలకు తోడ్పాటు అందించినట్లు భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కానీ ఆయన మాత్రం తమకు కనీసం సమాచారం కూడా అందించకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం తమనెంతో బాధించిందని ఆవేదన చెందారు. కేవలం అభివృద్ది కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన లింగయ్య పదిహేను రోజుల్లోనే 6కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. 

భువనగిరి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆయన మంగళవారం ప్రచారంలో నిర్వహించారు.ఈ  సందర్భంగా భువనగిరిలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ...టీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను అక్రమంగా కొంటోందని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము అదిష్టానంతో పోరాడి మరీ లింగయ్య  నకిరేకల్ టికెట్ ఇప్పించామని గుర్తుచేశారు. ఎన్నికల్లోనూ పోరాడి గెలిచామని...కానీ రెండు నెలల్లోనే లింగయ్య కాంగ్రెస్ ను వీడి తమ నమ్మకాన్ని వమ్ము చేయడం చాలా బాధించిందన ఆవేదన వ్యక్తం చేశారు. 

తమ కుటుంబ సభ్యుడిలాంటి చిరుమర్తి లింగయ్య ను కాంగ్రెస్ కు దూరం చేసి ముఖ్యమంత్రి కేసిఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టారని ఆరోపించారు. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే సన్నిహితున్ని ప్రలోభాలకు గురిచేసి  తమ పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. ఇలా ప్రతిపక్షాలను అనైతిక పద్దతుల్లో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్ కు త్వరలో ప్రజలే బుద్ది చేబుతారని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తమ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 22తేధీన నామినేషన్ వేయనున్నట్లు కోమటిరెడ్డి ప్రకటించారు.