లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కేసీఆర్ పాలన సాగుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ విమర్శించారు. అక్రమంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకుంటూ కాంగ్రెస్ ను దొంగదెబ్బ  తీయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని షబ్బీర్ అలీ ద్వజమెత్తారు. 

ఖమ్మం జిల్లాలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని  వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని షబ్బీర్ గుర్తు చేశారు. అయినా కేసీఆర్ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి చేర్చకుంటున్నారని ఆరోపించారు. ఆయనకు నిజంగా దమ్ము, ధైర్యం వుంటే ఖమ్మం లోక్ సభ నుండి ఎంపీగా పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. అప్పుడు ప్రజాభిప్రాయం తెలుస్తుందని షబ్బీర్ అలీ అన్నారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ బుజ్జగించి, ప్రలోభాలకు గురిచేసి, లేదంటే భయపెట్టి టీఆర్ఎస్ లో చేరేలా చేస్తున్నారని ఆరోపించారు. చేరిక సమయంలోనే ఎమ్మెల్యేలకు  రూ.25కోట్ల నగదు, నామినేటెడ్ పదవులను ఆశ చూపిస్తున్నారన్నారు. కొందరికయితే ఏకంగా మంత్రి పదవులను కూడా ఆఫర్ చేస్తున్నట్లు తెలిసిందని షబ్బీర్ అలీ తెలిపారు. 

కేవలం తెలంగాణలో మాత్రమై కేసీఆర్ మోదీని తిడతారని...డిల్లీ వెళితే మళ్లీ ఆయన కాళ్లు పట్టుకుంటారని అన్నారు. అసెంబ్లీ  ఎన్నికల్లో ఫెడరల్ ప్రంట్ కాస్తా లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి జాతీయ పార్టీ స్థాయికి ఎదిగిందని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు.