ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీ మరగా..తాజాగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు

ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీ మరగా..తాజాగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు అధిష్టానానికి లేఖ పంపినట్లు ఆయన ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని అభ్యర్థి గెలుపు కోసం పనిచేసే బాధ్యతను అధిష్టానం ఈ ఇన్‌చార్జులకు అప్పగించింది.

పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ప్రచార బాధ్యతలను ఇన్‌చార్జి పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే అగ్రనేత ప్రచార సభల నిర్వహణ వంటి బాధ్యతలనూ ఇన్‌చార్జికి పార్టీ అప్పగించింది. ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక్కో సీనియర్‌ నేతను ని యమిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా ఈ ఇన్‌చార్జులను ప్రకటించింది. 

అయితే ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయింది. మరోవైపు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, పార్టీలో చేరికలు ఇలా ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళికాబద్ధంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.

ఇలాంటి సమయంలో సుదర్శన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని.. అందుకే తాను రైతుల వెంట ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. 

రాజకీయాలకు దూరంగా ఉంటూ.. రైతుల తరపున పోరాటాలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రైతులకు మద్దతుగా నిలవడం కోసమే పార్టీకి రాజానామా చేసినట్లు చెప్పారు.