మార్చి 9వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఆ రోజు చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. అయితే, అదే రోజు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీ రామారావు కార్యక్రమం చేవెళ్లలో ఉంది. దాంతో రాహుల్ గాంధీ సభా వేదికను మార్చినట్లు చెబుతున్నారు.
హైదరాబాద్: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ సభకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తెలంగాణలో రాహుల్ గాంధీ లోకసభ తొలి ఎన్నికల ప్రచార సభను చేవెళ్లలో నిర్వహించాలని కాంగ్రెసు భావించింది. అయితే, దానికి అనుకోని ఆటంకాలు ఎదురయ్యాయి.
మార్చి 9వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఆ రోజు చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. అయితే, అదే రోజు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీ రామారావు కార్యక్రమం చేవెళ్లలో ఉంది. దాంతో రాహుల్ గాంధీ సభా వేదికను మార్చినట్లు చెబుతున్నారు.
ఆ రోజు కేటీఆర్ సభ ఉందని చెప్పడంతో మరో చోటికి వేదికను మార్చాలని రాహుల్ గాంధీ తమకు సూచించారని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్పారు. దాంతో మహేశ్వరంలోని పహడీ షరీఫ్ లో గల ఓ ప్రైవేట్ మైదానాన్ని రాహుల్ గాంధీ సభకు వేదికగా ఎంచుకున్నారు.
రాహుల్ గాంధీ సభను శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేస్తున్నట్లు కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్పారు.
ఇదిలావుంటే, చేవెళ్ల సభ నిర్వహణకు కాంగ్రెసు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి కూడా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ కార్యక్రమంపై చర్చించడానికి ఏర్పాటైన సమావేశానికి సబితా ఇంద్రారెడ్డి డుమ్మా కొట్టారు. దీనివల్ల కూడా రాహుల్ గాంధీ సభా వేదికను మార్చాల్సి వచ్చిందనే మాట వినిపిస్తోంది.