మల్కాజ్‌గిరి... అసెంబ్లీ ఎన్నికలయినా, లోక్ సభ ఎన్నికలయినా హైదరాబాద్ పరిధిలో ప్రత్యేకంగా వినిపించే నియోజకవర్గం పేరు. తెలంగాణ మొత్తం రాజకీయ సమీకరణాలు ఒకలా వుంటే ఇక్కడ మరోలా వుంటాయి. ఇక్కడ  ఆంధ్రా ప్రాంతానికి చెందిన సెటిలర్లతో పాటు విద్యాధికులు అధికంగా వున్నారు. వీరిని ప్రసన్నం చేసుకోడానికి రాజకీయ పార్టీలన్ని ఇక్కడ ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగుతుంటాయి. ఇలా ప్రస్తుతం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి వినూత్న ప్రచారాన్ని నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

మల్కాజిగిరి  లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని సఫీల్ గూడా మినీ ట్యాంక్ బండ్ పై ఆదివారం తెల్లవాజామున జాగింగ్ చూస్తూనే ప్రచారం నిర్వహించారు. ఇలా వాకర్లతో కలిసి నడుస్తూ నియోజకవర్గంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఎంపీ నిధులతో ఆ సమస్యలను పరిష్కరిస్తానని రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. 

ఇలా వాకింగ్ పేరుతో రేవంత్ చేపట్టిన వినూత్న ప్రచారానికి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో వాకర్లు ఆయనను కలుసుకున్నారు. ఇలా  ఒక్కొక్కరితో మాట్లాడిన రేవంత్ తనకు ఓటేసి గెలిపించాలని కోరారు.  

తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ లు ఈ లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగే అవకాశముండగా సెటిలర్లు అధికంగా వున్న మల్కాజ్ గిరిపై బిజెపి, కాంగ్రెస్ లు కన్నేశాయి.దీంతో ఇక్కడి నుండి బలమైన అభ్యర్ధులను బరిలోకి దించాయి. కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి, బిజెపి నుండి ఎమ్మెల్సీ రాంచంద్రారావు బరిలో నిలవగా టీఆర్ఎస్ మర్రి రాజశేఖర్‌రెడ్డి ని పోటీలో నిలిపింది.