తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. ముస్లీం మైనారిటీల ఓట్ల కోసం ఎంఐఎంతో దోస్తీ కట్టిన కేసీఆర్ ను షేర్వానీ వేసుకోని ఓవైసీ అంటూ ఎద్దేవా చేశారు. కానీ హిందూ ఓట్ల కోసం రాష్ట్రంలో అతిపెద్ద  హిందువును తానే అంటూ సీఎం మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు.  తన స్వార్థం కోసం యాగాలు చేసే కేసీఆర్ నిజమైన హిందువు కాదని లక్ష్మణ్ విమర్శించారు.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్ష్మణ్ కరీంనగర్ లో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... కేసీఆర్ కు నిజంగా హిదువులంటే అంత ప్రేమే వుంటే కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోతే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కనీసం వారి కుటుంబాలను పరామర్శించకపొవడాన్ని హిందూ సమాజం గుర్తుపెట్టుకుంటుందన్నారు. అంతే కాకుండా శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీరామ కళ్యాణానికి తాను కాకుండా మనవడితో పట్టువస్త్రాలు పంపించి అవమానించారని లక్ష్మణ్ గుర్తుచేశారు. 

నరేంద్ర మోదీకి భయపడే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నారు. ఇన్నిరోజులు అసదుద్దిన్ చంకలో దూరిన ఆయన ఇప్పుడు కేవలం లోక్ సభ ఎన్నికల కోసమూ హిందువులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీని తిడుతూ మైనార్టీ ఓట్లు...హిందువునని చెబుతూ హిందువుల ఓట్లు పొందాలని ఓ పథకం ప్రకారమే కేసీఆర్ మాట్లాడుతున్నారని లక్ష్మణ్ వివరించారు. 

టీఆర్ఎస్ కు సారు, కారు, పదహారు, సర్కారు కంటే  బీరు, బారు, సర్కారు నినాదం సరిపోతుందన్నారు. రాష్ట్రంలో మద్యాన్ని పారిస్తూ ప్రజలను తాగుబోతులుగా తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి అవినీతి, అక్రమాలు లేని పాలన కావాలంటే బిజెపికి ఓటేసి కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌, పెద్దపల్లి నుంచి కుమార్‌ను గెలిపించాలని లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.