ఇటీవల జరిగిన అసెంబ్లీలో ఎన్నికల్లో చతికిలపడ్డ తెలంగాణ బిజెపి లోక్ సభ ఎన్నికల్లో తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. అందుకోసం ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్పహించి పార్టీని బలోపేతం చేయాలని బిజెపి నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీలకు చెందిన పలువురు కీలక నాయకులతో మంగళవారం బిజెపి అధ్యక్షులు లక్ష్మణ్ సమావేశమయ్యారు. 

ఇందులో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుతో బిజెపి అధ్యక్షులు లక్ష్మణ సమావేశమయ్యారు. మంగళవారం హైదరాబాద్ లోని నాదెండ్ల నివాసానికి వెళ్లిన ఆయన దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఏ పార్టీలో లేకుండా తటస్థంగా వున్న నాదెండ్లను బిజెపి లో చేరాల్సిందిగా లక్ష్మణ్ ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ పనితీరును గతంకొంతకాలంగా నాదెండ్ల బహిరంగంగానే ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి ఆయన చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

ఈ భేటీ అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ...తమ ఆహ్వానంపై నాదెండ్ల భాస్కరరావు సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలో బిజెపి జాతీయాధ్యక్షులు అమిత్ షా తో ఆయన భేటీ కానున్నారని...ఆ తర్వాత ఆలోచించి తుది నిర్ణయం తీసుకుంటారనని చెప్పారని లక్ష్మణ్ తెలిపారు.