మరో నెలరోజుల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నట్లు బిజెపి మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రకటించారు. బిజెపి పార్టీ తరపున ఎక్కడినుండి పోటీ చేయమని అదిష్టానం ఆదేశించినా అందుకు సిద్దంగా వున్నానని తెలిపారు. అంతేకానీ తాను ఏ లోక్ సభ స్థానంపై  ఆసక్తి చూపడం కానీ...అదిష్టానంపై ఒత్తిడి తీసుకురావడం కానీ చేయడంలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటుచేశామని చెబుతున్న కూటమి అసలు ప్రధాని అభ్యర్థి ఎవరో ముందు ప్రకటించాలన్నారు. అలా కాకుండా అప్పుడే డిల్లీలో సర్కారును ఏర్పాటు చేస్తామనడం విడ్డూరంగా వుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ కేవలం 16 సీట్లతోనే కేంద్రంలో చక్రం తిప్పుతామనడం  హాస్యాస్పదంగా వుందన్నారు. 

ఇక కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కును కూడా కోల్పోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. సొంత ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి పంపించిన ఆ పార్టీ తమ బీటీమ్ అని కాంగ్రెస్ మరోసారి రుజువు చేసిందని విమర్శించారు. 

ఇక తనపైనా, ఈవీఎంల పైనా గతంలో విమర్శలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కపిల్ సిబల్, సయ్యద్ సుజు లపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కు ఫిర్యాదు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.   

కగత మూడు పర్యాయాలుగా అంబర్ పేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీంతో పార్లమెంట్ బరిలో నిలవనున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే ఆయన హైదరాబాద్ పరిధిలోని ఏదో ఒక లొక్ సభ స్థానం నుండి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై  త్వరలో స్వయంగా కిషన్ రెడ్డే క్లారిటీ  ఇవ్వనున్నట్లు సమాచారం.