తెలంగాణలో ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్ధి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని...ఈ నాలుగు నెలల్లోనే ఓటర్లలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. రాష్ట్రంలోని సగం లోక్ సభ స్ధానాలను కాంగ్రెస్ గెలుచుకోనుందని... అందులో భువనగిరి ఖచ్చితంగా వుంటుందని పేర్కొన్నారు.

భువనగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో జరిగిన పోలింగ్ సరళిపై ఆయన ఆత్మకూరులో విలేకరులతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ లకు గర్వం మరింత పెరిగిందని అన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన  కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ లపై వారు అహంపూరితంగా మాట్లాడటమే అందుకు నిదర్శనమన్నారు. వారి వైఖరిని ప్రజలు గమనించారని...అందువల్లే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేశారని అన్నారు. 

ఇక తాను ఎంపీగా గెలిచిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తానని తెలిపారు. ముఖ్యంగా ఈ లోక్ సభ పరిధిలోని పేదలకు నాణ్యమైన వైద్యం, విద్య తో పాటు కనీస సదుపాయాలను కల్పించడానికి కృషి చేస్తానన్నారు. అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడించారు. అంతేకాకుండా చదువుకున్న యువత స్వయం ఉపాధి పొందేలా స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలను కూడా చేపట్టనున్నట్లే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.