హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మూడు ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణ లోకసభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నాయి. తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణ లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. 

ఆంధ్రప్రదేశ్ శానససభ, లోకసభ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు కీలకంగా మారాయి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడం అనివార్యంగా మారింది. దీంతో ఆ మూడు పార్టీలు కూడా తెలంగాణ ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదు. 

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై దృష్టి పెట్టడం వల్ల తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు కలగలేదని, తెలంగాణ శాసనసభకు ముందస్తు ఎన్నికలు రావడం వల్ల కూడా సమయం చిక్కలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. 

తెలంగాణలో 2024 ఎన్నికల్లో తాము పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటామని వైఎస్సార్ కాంగ్రెసు చెబుతోంది. జనసేన మాత్రం మల్కాజిగిరి సీటుకు అభ్యర్థిని ప్రకటించింది. మిగతా చోట్ల ఆ పార్టీ పోటీ చేసే అవకాశం లేదని అంటున్నారు. 

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసుతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. కానీ, లోకసభ ఎన్నికలకు దూరంగా ఉంటోంది. ఖమ్మం నుంచి పోటీ చేస్తారని భావించిన తెలుగుదేశం మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు టీఆర్ఎస్ లో చేరడంతో ఆ ఆశ కూడా లేకుండా పోయింది. 

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను కూడా చంద్రబాబు నాయుడు దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే, లోకసభ ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అనే విషయాన్ని ఆయన తెలంగాణ పార్టీ శాఖకే వదిలేశారు. 

నామినేషన్ల దాఖలు చేయడానికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న ప్రస్తుత స్థితిలో తెలుగుదేశం తెలంగాణ శాఖ ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. తెలంగాణలో జగన్, చంద్రబాబు హోరాహోరీ పోరాటం చేస్తున్నారు. ఈ స్థితిలో తెలంగాణపై దృష్టి పెట్టే వీలు కూడా వారికి చిక్కడం లేదు. 

తెలంగాణలో కాస్తో కూస్తో బలంగా ఉందని భావించిన కాంగ్రెసు పార్టీ కూడా తుడిచిపెట్టుకుపోయే స్థితికి వచ్చింది. కాంగ్రెసు నాయకులు పలువురు ఇటు టీఆర్ఎస్ లోకో, అటు బిజెపిలోకో మారే పరిస్థితి ఉంది.