ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆస్తుల విలువ గణనీయంగా పెరిగింది. 2014 ఎన్నికల సమయంలో రూ. 3.94 కోట్లుగా ఉన్న ఆయన కుటుంబ ఆస్తి ప్రస్తుతం రూ.17.84 కోట్లకు చేరినట్లు అసదుద్దీన్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

అంతేకాకుండా తనపై ఐదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని , అలాగే రూ. లక్ష విలువైన ఎన్‌పీ బోర్ 0.22, ఎన్‌పీ బోర్ 30-60 రైఫిల్ ఉన్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని సిర్పూర్, హైదరాబాద్‌లోని మీర్‌చౌక్, చార్మినార్, బిహార్, నాందేడ్ పోలీస్ స్టేషన్‌లలో తనపై కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

తన పేరిట శాస్త్రిపురం, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఇళ్లు ఉన్నాయని, అలాగే తన భార్య ఫర్హీన్ పేరిట సన్సద్ విహార్, ద్వారకా, న్యూఢిల్లీ, మిస్రీగంజ్‌లో ఇళ్లు ఉన్నట్లు అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు.

అలాగే  తను రూ.9.30 కోట్లు, తన భార్య ఫర్హీన్ రూ.2.75 కోట్లను బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఆయన ఆస్తుల విలువ 2014తో పోలిస్తే నాలుగింతలు పెరిగింది.