తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి మొదలయ్యింది. ఈసీ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ అప్రమత్తమయ్యాయి. అయితే ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం ఆ పార్టీ  మిత్రపక్షం ఎంఐఎం కూడా సహాయ సహకారాలు అందిస్తోంది. ఇందులో భాగంగా లోక్ సభ ఎన్నికలపై జరిగిన ముందస్తు సర్వేపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయగా...దానికి సపోర్టుగా ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ రీట్వీట్ చేశారు. 

''లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 17-0 ఫలితాలు రావడం ఖాయం. తెలంగాణ ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ను దీవిండానికి సిద్దంగా వున్నారు. లోక్ సభలో సాధించే విజయం తమది కాదు... రాష్ట్రంలోని ప్రతి వర్గానిది. నిజమైన ఫెడరలిజం సాధించడానికి ఈ విజయం చాలా ఉపయోగపడుతుంది'' అంటూ కేటీఆర్ ట్వీట్ పై స్పందిస్తూ అసద్ రీట్వీట్ చేశారు. 

అంతకు ముందు కేటీఆర్ '' పార్లమెంట్ ఎన్నికలకు మరో నెల రోజుల సమయం వుంది. ఇప్పటికి వెలువడిన ముందస్తు ఎన్నికల సర్వేలు తెలంగాణలో టీఆర్ఎస్ స్వీప్ చేస్తుందని చెబుతున్నాయి. ముఖ్యంగా సీ వోటర్స్ సర్వే మొత్తం లోక్ సభ స్థానాల్లో 16 టీఆర్ఎస్ కు ఒకటి ఎంఐఎం కు వస్తాయని తేల్చింది. అలాగే ఇండియా టీవి సర్వే కూడా 16 స్థానాలకు గాను 14  టీఆర్ఎస్ కు, 1 ఎంఐఎం కు వస్తాయని వెల్లడించింది.'' అంటూ ట్వీట్ చేశారు.