లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటివరకు  మజ్లీస్ పార్టీ కేవలం తెలంగాణకే పరిమితమైన విషయం తెలిసిందే. అందులోనూ  కేవలం హైదరాబాద్ ఎంపీ స్థానానికి మాత్రమే ఆ పార్టీ అధ్యక్షులు అసదుద్దిన్  ఓవైసి పోటీ పడుతూ...ప్రతిసారి గెలుస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన తనకు తోడుగా పార్లమెంట్ కు మరో ఎంపీని తీసుకుపోవాలని చూస్తున్నట్లున్నారు. అందుకోసం మొదటిసారిగా తెలంగాణ లో కాకుండా పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఓ లోక్ సభ స్ధానానికి ఎంఐఎం పోటీలో నిలిచింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత అసదుద్దిన్  ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. 

మహారాష్ట్రలో మైనారిటీ ఓటు బ్యాంక్ అధికంగా వున్న ఔరంగాబాద్ లోక్ సభ స్థానంలో ఇంతియాజ్ జలీల్ పోటీ చేయనున్నట్లు ఓవైసి ప్రకటించారు. ప్రస్తుతం ఔరంగాబాద్ సెంట్రల్ అసెంబ్లీ స్ధానం  నుండి ఎంఐఎం ఎమ్మెల్యేగా ఇంతియాజ్ జలీల్ కొనసాగుతున్నారు. ఇలా స్థానికంగా మైనారీ ప్రజల్లో మంచి పేరున్న ఇంతియాజ్ ప్రత్యర్థి పార్టీలను ధీటుగా ఎదుర్కొంటాడని భావించి  ఆయన సీటు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

ఇక ఇదే మహారాష్ట్ర రాజధాని ముంబైలో కూడా ఎంఐఎం పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బైకులా ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌ను ముంబై నార్త్ సెంట్రల్ లేదా ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని ఓవైసి భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ విషయంపై ఓవైసి నుండి ఇంకా క్లారిటీ రాలేదు. 

మహారాష్ట్రలో ఫేజ్ 3 లోక్ సభ ఎన్నికల్లో బాగంగా ఎప్రిల్ 23  న ఔరంగాబాద్ లో ఎన్నికలు జరగనున్నాయి. అందుకు మరో నెలరోజులు సమయం ఉందనగానే  ఓవైసి అభ్యర్ధిని ప్రకటించడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకు గట్టి హెచ్చరిక పంపారు. ఇప్పటికే దళిత నాయకులు ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని వాంచిత్ బహుజన్ అగాధి పార్టీతో పొత్తు పెట్టుకున్న ఎఐఎంఐఎం మహారాష్ట్రలో దూకుడుగా ముందుకెళుతోంది.