నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం ఎన్నికల ఫలితం అన్నింటికంటే ఆలస్యంగా ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కనీసం ఒక రోజైనా సమయం పడుతుందని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో భారీ స్థాయిలో రైతులు నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. 

సర్కారు తీరుపై ఆగ్రహించిన అన్నదాతలు 150 కి పైగా నామినేషన్లు వేసి ప్రభుత్వం పై నిరసన తెలిపారు. మొత్తం 185 మంది అభ్యర్థు బరిలో నిలవడంతో ఎన్నికల కోసం 12 ఈవీఎం యూనిట్లు వినియోగించారు. నోటాతో కలిపి మొత్తం 186 గుర్తులు ఉంటాయి. నియోజకవర్గంలో మొత్తం 1788 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే... ఓట్ల లెక్కింపు కోసం కేటాయించిన టేబుళ్లు కూడా సరిపోవని అధికారులు వాపోతున్నారు. మొత్తం నిజామాబాద్ నియోజకవర్గానికి 18టేబుళ్లను ఏర్పాటు  చేశారు. ఒక్కో టేబుల్ కి ఆరుగురు అధికారులు ఉంటారు.  అయితే... పోలింగ్ త్వరగా జరగాలంటే కనీసం 36 టేబుళ్లు అయినా అవసరం అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు 36 టేబుళ్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ కూడా చేశారు. అయితే... ఈ విషయం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.