న్యూఢిల్లీ: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎ్‌సఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌)కు దివాలా చర్యల గండం పొంచి ఉంది. ఈ రెండు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు తమ వెండార్ల (సరఫరా సంస్థలు)కు రూ.20 వేల కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. 

బకాయిలను రాబట్టుకోవడానికి దివాళా స్మృతి చట్టాన్ని ప్రయోగించాలని కొందరు వెండార్లు భావిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలపై దివాలా పరిష్కార చర్యలు ప్రారంభించాలని కోరుతూ జాతీయ కంపెనీల చట్టం ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించాలని యోచిస్తున్నారు. 

‘ఈ రెండు టెల్కోలతోపాటు రూ.45 వేల కోట్ల భారత్‌ నెట్‌ ప్రాజెక్టు టెలికాం గేర్లు, ఇతర ఉత్పత్తులను సరఫరా చేసిన సంస్థలకు దాదాపు రూ. 20 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. కాగా, బ్యాంకులేమో తమ బకాయిలు రాబట్టుకునేందుకు సరఫరా సంస్థలపై ఒత్తిడి చేస్తున్నాయి’ అని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ టెలికాం కమిటీ చైర్మన్‌ సందీప్‌ అగర్వాల్‌ చెప్పారు.

also read  ఎయిర్‌టెల్ & వొడాఫోన్‌కు ముకేశ్ అంబానీ అడ్వైజ్

బీఎస్ఎన్‌ఎల్‌కు వ్యతిరేకంగా ఈ నెల 19వ తేదీన వెండార్లంతా కలిసి ధర్నా చేయనున్నారు. ఆ తర్వాత 10 రోజుల్లోగా బకాయిలు చెల్లించకపోతే, వారు బీఎస్ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించనున్నారు’’ అని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ టెలికాం కమిటీ చైర్మన్‌ సందీప్‌ అగర్వాల్‌ తెలిపారు. 

కాగా సరఫరా సంస్థలకు రూ.400 కోట్లకు మించి బకాయిలేమని ఎంటీఎన్‌ఎల్‌ చైర్మన్‌, ఎండీ సునీల్‌ కుమార్‌ తెలిపారు. వాటిని అతి త్వరలోనే తీర్చేస్తామని సునీల్‌ కుమార్‌ తెలిపారు. తన ఉద్యోగుల కోసం ఎంటీఎన్‌ఎల్‌ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) ప్రకటించింది. ఈ స్కీమ్‌ను ఎంచుకునేందుకు ఉద్యోగులకు వచ్చే నెల మూడో తేదీ వరకు గడువు ఇచ్చింది.

‘2020 జనవరి 31 నాటికి 50 ఏళ్లు, ఆపై బడిన రెగ్యులర్‌, పర్మినెంట్‌ ఉద్యోగులంతా ఈ పథకాన్ని ఎంచుకునేందుకు అర్హులు’ని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎంటీఎన్‌ఎల్‌లో 22వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. దాదాపు 15,000 మంది ఈ పథకాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.


 also read ఉద్యోగుల స్వచ్చంద పదవీ విరమణపైనే కేంద్రం ప్రియారిటీ


బీఎస్ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌, భారత్‌ నెట్‌ ప్రాజెక్ట్‌కు విడిభాగాలు, ఇతర ఉత్పత్తులు సరఫరా చేసిన సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ టెలికాం కమిటీ చైర్మన్‌ సందీప్‌ అగర్వాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా ప్రధాని మోదీకే పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. ఎలాంటి స్పందన లేదన్నారు. 

ఇక ఉద్యోగాలకు కోత పెట్టడం మినహా మరోదారి లేదని సరఫరా సంస్థలు భావిస్తున్నాయని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ టెలికాం కమిటీ చైర్మన్‌ అన్నారు. ఇప్పటికే వాటిలో పలు సంస్థలు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేవని పేర్కొన్నారు.

టెలికాం విడిభాగాలు, ఉత్పత్తుల సరఫరాదారుల విభాగంలో మొత్తంగా 2 లక్షల మంది పనిచేస్తున్నారు. మరికొన్ని వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే, ఈ విభాగంలో సగం (లక్ష) మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ టెలికాం కమిటీ చైర్మన్‌ సందీప్ అగర్వాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.