న్యూఢిల్లీ: భారతీయ టెలికం సంస్థల మధ్య పసందైన వార్ సాగుతోంది. 2016లో జియోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రిలయన్స్ సంస్థకు, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలకు మధ్య ప్రీ పెయిడ్ చార్జీలు, ఇంటర్ కనెక్ట్ చార్జీల విషయమై మాటల యుద్ధం సాగింది. ఉచితంగా సేవలందిస్తానన్న రిలయన్స్ జియో ఇంటర్ కనెక్ట్ కాల్స్ విషయమై నిమిషానికి ఆరు పైసలు వడ్డించడంతో ఆత్మరక్షణలో పడింది.

దీనికి ప్రతిగా సవరించిన టెలికం సర్వీసు ప్రొవైడర్లు  స్థూల ఆదాయం (ఏజీఆర్) ప్రభుత్వ బకాయిల రూపంలో రూ.92 వేల కోట్ల మొత్తం మూడు నెలల్లో కేంద్రానికి చెల్లించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ వెంటనే ఎయిర్ టెల్ అధినేత సునీల్ మిట్టల్ తన సొదరుడు రాజన్ మిట్టల్‌తో కలిసి కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను కలిశారు. కేంద్రం కూడా ఉద్దీపన ప్యాకేజీ అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నదన్న సంకేతాలు వచ్చాయి. 

also read మెరుగైన స్లిమ్ డిజైన్‌తో ఏంఐ టీవీ 5 వచ్చేస్తుంది

ఆ వెంటనే ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ప్రతి స్పందించింది. తన ప్రత్యర్థి సంస్థలకు ఎలాంటి ఆర్థిక ఉపశమనం కలిగించొద్దని కేంద్రాన్ని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. బకాయిల చెల్లింపునకు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలకు అన్ని రకాల ఆదాయ వనరులు ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నది. 

సదరు కంపెనీలకు గల ఆదాయ వనరులను పేర్కొంటూ రిలయన్స్ జియో కొన్ని సూచనలను కూడా చేసింది. సంస్థకు గల పలు ఆస్తులు, వాటాలను విక్రయించడం ద్వారా ఎయిర్ టెల్ సంస్థ 5.7 బిలియన్ల డాలర్లు సమకూర్చుకునే అవకాశం ఉందని సెలవిచ్చింది. అలాగే వొడాఫోన్ ఐడియాకు ఇటువంటి అవకాశాలే ఉన్నాయని సలహా ఇచ్చింది. ఈ రెండు సంస్థలు తమకు ఇండస్ టవర్స్‌లో గల వాటాలను విక్రయించ వచ్చని ఉచిత సలహా ఇచ్చింది జియో. 

also read అమేజాన్ యాప్ వాడుతున్నారా...అయితే మీకో గుడ్ న్యూస్

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రానికి ఎయిర్ టెల్ రూ.21,682.13 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.19,823 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. బకాయిల చెల్లింపులో తమకు ఉపశమనం కలిగించాలని కేంద్రాన్ని ఈ రెండు సంస్థలు అభ్యర్థించాయి. ఈ రెండు సంస్థల అభ్యర్థనలను కేంద్రం పరిశీలిస్తామని చెప్పింది.

ఈ నేపథ్యంలోనే కేంద్రానికి జియో రెగ్యులేటరీ అఫైర్స్ అధ్యక్షుడు ఈ నెల ఒకటో తేదీన లేఖ రాశారు. దాన్ని ఆదివారం బహిర్గతం చేశారు. ‘స్పెక్ట్రం ఒక పరిమిత వనరు. దాన్ని ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉపయోగించొద్దు’ అన్న సుప్రీంకోర్టు తీర్పును జియో తన లేఖలో గుర్తు చేసింది. కోర్టు నిర్దేశించిన మూడు నెలల్లోగా కంపెనీలు బకాయిలు చెల్లించాల్సిందేనని అభిప్రాయ పడింది.