ఈ నెల22వ తేదీ నుంచి ట్విట్టర్లో రాజకీయ ప్రకటనలు నిషేధిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. సామాజిక, పర్యావరణ సంబంధిత ప్రకటనలకు మినహాయింపు ఇస్తున్నట్లు తాజాగా ట్విట్టర్ ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఈ నెల 22వ తేదీ నుంచి రాజకీయ ప్రకటనలను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంలో సామాజిక, పర్యావరణ సంబంధిత ప్రకటనలకు మినహాయింపు ఇస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. సామాజిక కార్యకర్తల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వార్తలు ప్రచురించే వార్తా సంస్థలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది.
'సామాజిక సమానత్వం, పర్యావరణం, ఆర్థికాభివృద్ధి వంటి అంశాల్లో పౌరులను ఉత్తేజపరిచి, అవగాహన పెంపొందించే ప్రకటనలను అనుమతిస్తున్నాం. అయితే అవి నిషేధిత రాజకీయ వార్తలు, రాజకీయ ప్రకటనదారులను సూచిస్తూ ఉండకూడదు' అని ట్విట్టర్ పేర్కొంది.
also read జియో సెన్సేషన్: ఐయూసీపై జాప్యంతో చౌక సేవలు కష్టమే
రాజకీయ ప్రకటనల నిషేధం విధిస్తున్నట్లు గత నెలలో ట్విట్టర్ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి మరిన్ని వివరాలను తాజాగా వెలువరించింది. రాజకీయ ప్రకటనలలో నిషేధిత అంశాలను ట్విట్టర్ పొందుపర్చింది. ఓట్ల కోసం విజ్ఞప్తులు, ప్రచారం కోసం విరాళాలను అభ్యర్థించడం వంటివి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
రాజకీయ సమాచారంలో భాగంగా అభ్యర్థి లేదా పార్టీ ప్రకటనలు, శాసన ఫలితాలు వంటివి నిషేధంలోకి వస్తున్నట్లు వెల్లడించింది.ట్విట్టర్ కొత్తగా ప్రవేశపెట్టిన నూతన విధానం వల్ల మినహాయింపు పొందిన ప్రకటనలు సమాచారాన్ని లక్ష్యంగా చేసుకునే అంశంపై కొన్ని ఆంక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. పోస్టల్ కోడ్ ఆధారంగా నిర్దిష్ట ప్రాంతాల్లో కాక రాష్ట్రాలు, ప్రాంతీయ స్థాయిలోనే ప్రకటనలు ఇచ్చే అవకాశం ఉంటుంది.
also read శామసంగ్‌కు పోటీ: సరికొత్తగా విపణిలోకి మోటో ఫోల్డబుల్ ఫోన్
రాజకీయ ప్రకటనలు నిషేధిస్తూ ట్విట్టర్ తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఫేస్బుక్ సైతం ఇలాంటి వాటిని పాటించాలని కొందరు సూచిస్తుండగా, ఈ నిర్ణయం అమలు సాధ్యం కాకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
నిషేధం వల్ల ట్విట్టర్ మిలియన్ డాలర్ల మేర నష్టపోతుందని డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార మేనేజర్ బ్రాజ్ పార్స్కాల్ వ్యాఖ్యానించారు. ఇదొక బుద్ధిలేని నిర్ణయమని ఎద్దేవా చేశారు. ప్రకటనల నిషేధం వల్ల రాజకీయ నాయకుల ట్వీట్లను రీట్వీట్ చేయడంపై ఎలాంటి ప్రభావం ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ద్వారా డబ్బు తీసుకొని రీట్వీట్ చేసే ఖాతాలు పెరుగుతాయని అన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 16, 2019, 12:22 PM IST