న్యూఢిల్లీ: ప్రముఖ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ శామ్‌సంగ్ తన మొబైల్ ఫోన్ల శ్రేణిలో మరో స్మార్ట్‌ఫోన్‌ను విపణిలోకి తీసుకొచ్చింది. ఏ80 పేరుతో విడుదల చేసిన ఈ మొబైల్ ధరను రూ.47,990గా నిర్ణయించింది. గెలాక్సీ ఏ సిరీస్ లోనే ఇది అత్యంత ఖరీదైనది. ఈ నెల 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రీ ఆర్డర్లను శామ్ సంగ్ స్వీకరిస్తోంది. 

దీంతో పాటు అనూహ్య పరిస్థితుల్లో మొబైల్ స్క్రీన్ పగిలిపోతే ఒకసారి రీప్లేస్మెంట్ చేయనుంది. ఇందులో శామ్ సంగ్ పే, ఇన్ఫినిటీ డిస్ప్లే, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ వంటి వసతులు ఉన్నాయని శామ్ సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ విభాగం డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ తెలిపారు. 

ఇక సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ ఫోన్ కొనుగోలుపై అదనంగా మరో 5శాతం రాయితీని పొందవచ్చు. శామ్ సంగ్ ఆన్ లైన్ స్టోర్, శాంసంగ్ ఒపేరా హౌజ్‌ల్లో దీనికోసం ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చు. ఆగస్టు 1 నుంచి రిటైల్ షాపుల్లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇది తెలుపు, నలుపు, గోల్డ్ కలర్లలో లభిస్తుంది.  

6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ సూపర్ ఆమోల్డ్ డిస్ ప్లేతోపాటు స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్ అమర్చారు. ఈ ఫోన్ లో 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉంటుంది. 48+8 మెగా పిక్సెల్ డ్యుయల్ రొటేట్ కెమెరా, ఐఆర్ సెన్సార్‌తో 3డీ డెప్త్ కెమెరాలను అమర్చారు. ఇక 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం గల 3700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 

శామ్ సంగ్ గెలాక్సీ ఎ80 ఫోన్ సూపర్ స్టడీ మోడ్, లైఫ్ ఫోకస్ వీడియో తదితర ప్రీ లోడెడ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ప్రత్యర్థి సంస్థలు నోకియా 9 ప్యూ వ్యూ, వన్ ప్లస్ 7 ప్రో, ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ వంటి ఫోన్లతో తలపడుతుంది.