న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ లో తీసుకు వచ్చిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) కోసం ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రెండు రోజుల్లో ఇందుకోసం 22 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని కార్పొరేషన్ కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 

ఈ నెల ఐదో తేదీన ఈ పథకం ప్రారంభమైంది. డిసెంబర్ మూడో తేదీ వరకు గడువు ఉంది. కానీ కేవలం రెండు రోజుల్లోనే ఇంత మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. వీరిలో 13 వేల మంది గ్రూప్ సీ కేటగిరీ ఉద్యోగులని సదరు అధికారి తెలిపారు. 

also read   సౌత్ ఇండియన్ మూవీస్ ఆఫర్....జియో యూసర్స్ కి మాత్రమే

మొత్తం 1.5 లక్షల మంది సిబ్బందిలో 50 ఏళ్లకు పైబడిన లక్ష మంది ఉద్యోగులు వీఆర్ఎస్ పథకానికి అర్హులుగా ఉన్నారు. వీరిలో 70-80 వేల మంది దరఖాస్తు చేసుకుంటారని, తద్వారా నెలవారీగా రూ.7000 కోట్ల మేర వేతనాల భారం తగ్గుతుందని బీఎస్ఎన్ఎల్ యాజమాన్యం భావిస్తోంది.

మరోవైపు ఎంటీఎన్ఎల్ సంస్థలోనూ వీఆర్ఎస్ ప్రక్రియ కొనసాగుతున్నది. నష్టాల్లో ఉన్న ఈ రెండు కంపెనీలను విలీనం చేయడంతోపాటు వీఆర్ఎస్ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ వీఆర్ఎస్ పథకం మొదలైంది. 

నెల రోజులు ఉచితంగా బ్రాడ్ బ్యాండ్ అండ్ వై-ఫై సేవలు
దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ వినియోగదారులకు నెల రోజుల పాటు ఉచితంగా బ్రాడ్ బ్యాండ్, వై-ఫై సేవలు అందిస్తామని సంస్థ సీఎఫ్ఎ విభాగం ఎండీ వివేక్ బంజాల్ తెలిపారు.

also read 8,200mAh బ్యాటరీతో LG జి ప్యాడ్ 5....ధర ఎంతో తెలుసా ?

ల్యాండ్ లైన్ వినియోగదారులు ఐదు నిమిషాలకు పైబడి ఔట్ గోయింగ్ కాల్ చేసి మాట్లాడినా తామే ఆరు పైసలు ఎదురు ఇస్తామన్నారు. ఎన్ని కాల్స్ ఐదు నిమిషాలు మించి మాట్లాడినా ఇస్తామన్నారు. ఉచిత బ్రాడ్ బాండ్ ప్లాన్‌లో నెల రోజులు 10 ఎంబీపీఎస్ స్పీడ్ తో రోజూ 5జీబీ వరకు ఇంటర్నెట్ ఉచితంగా వాడుకోవచ్చునన్నారు. తర్వాత రోజుకు 2జీబీ విత్ 8 ఎంబీపీఎస్ స్పీడ్ తో రూ.349లకే కనీస ప్లాన్ అమలులోకి వస్తుందన్నారు.

త్వరలో ఆంధ్రప్రదేశ్ అంతటా 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయని బీఎస్ఎన్ఎల్ సీఎఫ్ఏ విభాగం ఎండీ వివేక్ బంజాల్ తెలిపారు. రాష్ట్రంలో ఫైబర్ కనెక్టివిటీతో కేబుల్, ఇతర డేటా సేవలు అందించే సంస్థల భాగస్వామ్యంతో ‘ఫైబర్ బ్రాడ్ బ్యాండ్, హోం వైఫై కనెక్షన్లు అందిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా సంస్థకు 1.60 లక్షల మంది, రాష్ట్రంలో 9000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది వీఆర్ఎస్ ప్యాకేజీ కింద పదవీ విరమణ చేసే అవకాశం ఉన్నదని వివేక్ బంజాల్ వివరించారు.