వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో విదేశీ ఉద్యోగులను తప్పుగా వర్గీకరించి చూపడం, పన్నుపరమైన మోసాలకు పాల్పడటం తదితర ఆరోపణలతో కూడిన కేసును ఎదుర్కొన్న భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కోర్టు వెలుపల పరిష్కరించుకోనున్నది. ఇందుకోసం కాలిఫోర్నియా రాష్ట్రానికి ఎనిమిది లక్షల  డాలర్లు (సుమారు రూ.5.6 కోట్లు) చెల్లించనుందని ఆ రాష్ట్ర అటార్నీ జనరల్ జేవియర్ బెసెరా తెలిపారు.

also read కొత్త సోలార్ పవర్ హెడ్‌ఫోన్స్...ఒక్కసారి చార్జ్ చేస్తే 3 రోజులవరకు..

‘తక్కువ జీతాలతో పని చేయించుకునేందుకు, పన్నులు ఎగ్గొట్టేందుకు ఇన్ఫోసిస్ తప్పుడు వీసాలపై ఉద్యోగులను అమెరికాకు తీసుకువచ్చిందని, కాలిఫోర్నియా చట్టాలను ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవనడానికి ఈ సెటిల్మెంట్ ఒక నిదర్శనం కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బెసెరా పేర్కొన్నారు.

2006–2017 మధ్య అమెరికాలో 500 మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ హెచ్–1బీ వీసాలపై కాకుండా బీ–1 వీసాలపై పనిచేయించుకుందన్న ప్రజా వేగు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఇలాంటి తప్పుడు వర్గీకరణ వల్ల ఇన్ఫోసిస్ కాలిఫోర్నియా రాష్ట్రంలో నిరుద్యోగ బీమా, వైకల్య బీమా, ఉద్యోగుల శిక్షణ పన్నులు చెల్లించకుండా తప్పించుకుందని ఆరోపణలు ఉన్నాయి. 

సాధారణంగా హెచ్–1బీ వీసాలపై పనిచేసే సిబ్బందికి స్థానిక నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు హెచ్1 బీ వీసాలపై పరిమితి ఉండటం, ఆ వీసాపై వచ్చే ఉద్యోగులకు అక్కడి ప్రమాణాల ప్రకారం వేతనం చెల్లించాల్సి ఉండటంతో ఇన్ఫోసిస్ బీ-1 వీసాపై ఉద్యోగులను అక్కడికి తరలించిందన్న ఆరోపణలు ఉన్నాయి. 

also read  కొత్త స్మార్ట్‌వాచ్...ఒక్కసారి చార్జ్ చేస్తే 10 రోజుల వరకు...

ప్రజా వేగు ఫిర్యాదు మేరకు ఇన్ఫోసిస్ అవకతకవలు బయటపడటంతో ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లించేందుకు సంస్థ ఒప్పుకుంది. సుదీర్ఘంగా 13 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదానికి  ముగింపు పలకాలన్న ఉద్దేశంతోనే పరిష్కరించుకుంటున్నట్లు వివరణనిచ్చింది. తప్పుడు పత్రాలు సమర్పించిందన్న ఆరోపణలను సెటిల్ చేసుకునేందుకు 2017లో న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫోసిస్ 10 లక్షల డాలర్లు చెల్లించింది.