Asianet News TeluguAsianet News Telugu

ఈ సంవత్సరం గూగుల్ లో ఎక్కువగా ఏం సెర్చ్ చేశారో తెలుసా...?

దేశ దేశాల్లో ఏదైనా కొత్త విషయం గురించి తెలుసుకోవాలంటే గుర్తుకు వచ్చేది ‘గూగుల్’. మరో 18 రోజుల్లో 2019 సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది ‘సెర్చ్’ గురించి గూగుల్ రిపోర్ట్ చేసింది. ప్రపంచకప్ టోర్నీ సెమీ ఫైనల్స్ దశలో ఓడిపోయినా టీమిండియాకే ఓటేశారు మనోళ్లు. ఇక శత్రువుకు చిక్కానా ధైర్యం సడలని ధీరుడు వర్ధమాన్ అభినందన్ గురించి నెటిజన్లు విపరీతంగా వెతికారు.
 

google top searches of the year in 2019
Author
Hyderabad, First Published Dec 12, 2019, 11:30 AM IST

న్యూఢిల్లీ: మనకు ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ‘సెర్చింజన్` గూగుల్ను ఆశ్రయించాల్సిందే. అది యూజర్ ఫ్రెండ్లీ కావడంతో దాన్ని వినియోగించేందుకు ప్రతి ఒక్కరూ ఇష్ట పడుతుంటారు. ఈ ఇంటర్నెట్ దిగ్గజం 2019లో భారతీయ యూజర్లు ఎక్కువగా వేటి కోసం వెతికారన్న విషయమై నివేదిక సమర్పించింది. వ్యక్తుల నుంచి కార్యక్రమాలు, అంశాల వారీగా తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకున్న వాటి గురించి తెలుసుకుందాం.. 

క్రికెట్ ప్రపంచకప్ గురించి భారతదేశంలో అత్యధికులు సెర్చ్ చేశారు. ప్రపంచకప్ టోర్నమెంట్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా సెమీ ఫైనల్స్ దశలో ఇంటిముఖం పట్టినా భారతీయులు ప్రపంచ కప్ గురించి వెతికిన పదంగా అగ్రస్థానంలో ఉండటం ఆశ్చర్యకర పరిణామం.

2019 లోక్సభ ఎన్నికల గురించి ‘సెర్చింజన్`లో గణనీయంగానే నెటిజన్లు సెర్చ్ చేశారు. ఈ ఎన్నికల్లో నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అధిక స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ‘సెర్చ్`లో గూగుల్ ప్రకటించిన జాబితాలో ‘లోక్సభ ఎన్నికలు` రెండో స్థానంలో నిలిచింది.

also read స్మార్ట్​ఫోన్​కు రక్షణ కల్పించే యూఎస్బీ కండోమ్​ గురించి తెలుసా?

చంద్రుడిపై ఇస్రో ప్రయోగించిన ‘చంద్రయాన్-2` గురించి ఎక్కువ మంది నెటిజన్లు వెతికారు. ల్యాండింగ్‌కు కొద్ది నిమిషాల ముందుకు విక్రం ల్యాండర్లో లోపం వల్ల కమ్యూనికేషన్ కోల్పోయింది. దీని గురించి వెతికిన నెటిజన్ల జాబితాలో ‘చంద్రయాన్-2` మూడో స్థానంలో ఉంది.

వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్లో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘కబీర్ సింగ్` అనూహ్యంగా సెర్చింజన్ జాబితాలో నాలుగో స్థానం పొందింది. తెలుగులో సందీప్ రెడ్డి రూపొందించిన అర్జున్ రెడ్డి సినిమాకు ఇది రీ మేక్.

మనదేశంలో హాలీవుడ్ సినిమాలకు ఎంతో ఆదరణ ఉంది. అలా అవెంజర్స్ సిరీస్లో వచ్చిన ‘అవెంజర్స్: ఎండ్ గేమ్స్`కు  సెర్చింజన్ జాబితాలో ఐదో స్థానం లభించింది. మార్వెల్ సంస్థ దీన్ని రూపొందించింది. ఈ ఏడాది ఆగస్టు ఐదో తేదీన జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. గూగుల్లో అత్యధికులు వెదికిన జాబితాలో అధికరణం 370కు ఆరో ర్యాంక్ వచ్చింది.

వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఫలితాల కోసం ఎక్కువ మంది వెతికారని సెర్చింజన్ నివేదిక చెబుతున్నది. దీంతో ఏడో స్థానంలో ‘నీట్ రిజల్ట్స్` నిలిచాయి. జోక్విన్ ఫీనిక్స్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న హాలీవుడ్ సినిమా జోకర్ ఎనిమిదో స్థానం పొందింది. మరో హాలీవుడ్ సినిమా కెప్టెన్ మార్వెల్ ఎనిమిదో ర్యాంక్ పొందింది.

రైతులకు ఏడాదికి రూ.6000 అందజేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ ప్రవేశపెట్టిన పథకం పీఎం కిసాన్ యోజన. దీనికోసం నెటిజన్లలో ఎక్కువ మంది గూగుల్లో వెతికారు. దీంతో ఈ జాబితాలో టాప్ 10 జాబితాలో చోటు పొందింది.  అత్యంత ట్రెండింగ్ పర్సనాలిటీల్లో భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ మొదటి స్థానంలో నిలిచారు. 

శత్రు సైనికుల చెరలో ఉన్నా.. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారు ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌. శత్రుదేశం చేతుల్లోకి చిక్కినా తలవంచకుండా గుండె నిబ్బరంతో నిలిచారు. ఆయన ధైర్యసాహసాలు మెచ్చి కేంద్ర ప్రభుత్వం వీర్‌చక్రతో సత్కరించింది. దేశభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆయన 2019లో గూగుల్‌లో మోస్ట్‌ ట్రెండింగ్‌ పర్సనాలిటీ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.

ప్రఖ్యాత గాయని లతామంగేష్కర్‌ అనారోగ్యంతో ఇటీవల ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరారు. 28 రోజులు చికిత్స పొందాక ఆమె తిరిగి ఇంటికెళ్లిపోయారు. తన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె మనసారా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.

also read వాట్సాప్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్...ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.

క్రికెట్‌ అభిమానుల రారాజు.. భారత క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ గూగుల్‌ మోస్ట్‌ ట్రెండింగ్‌ పర్సనాలిటీ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. బీహార్‌కు చెందిన ప్రముఖ గణితవేత్త, సూపర్‌ 30 వ్యవస్థాపకుడు ఆనంద్‌ కుమార్‌ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ఆయన జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన సూపర్‌ 30 సినిమాలో హృతిక్‌ రోషన్‌ ఆనంద్‌ కుమార్‌ పాత్రలో నటించి మెప్పించాడు. 

పాకిస్థాన్‌ సైన్యంపై ప్రతీకార చర్యలో భాగంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’లో విక్కీ కౌశల్‌ నటించారు. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో కౌశల్ గురించి ‘సెర్చింజన్’లో ఎక్కువ వెతికారట. దీంతో యువ నటుడు ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. 22 ఏళ్ల భారత యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ మోస్ట్‌ ట్రెండింగ్‌ పర్సనాలిటీలో ఆరో స్థానంలో నిలిచాడు.

పశ్చిమ్‌ బంగాలోని ఓ రైల్వే స్టేషన్‌లో సరదాగా పాటలు పాడుతూ ఉన్న రాను మొండల్‌ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ కావడంతో ఆమె సెలబ్రిటీగా మారారు. గూగుల్‌ సెర్చ్‌లో వెతికిన వ్యక్తిగానూ ఏడో స్థానంలో నిలిచారు. బాలీవుడ్‌లో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2’ తో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు తారా సుతారియా. మోస్ట్‌ సెర్చ్‌డ్‌ పర్సనాలిటీ జాబితాలో తారా ఎనిమిదో స్థానం దక్కించుకుంది. 

బుల్లితెర నటుడైన సిద్ధార్థ్‌ శుక్లా ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం సిద్ధార్థ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌- 13లో ఉన్నాడు. నటి కొయినా మిత్ర కూడా బిగ్‌బాస్‌ సీజన్‌- 13లో పాల్గొంటున్నారు. నెటిజన్లు వెతికిన మోస్ట్‌ ట్రెండింగ్ పర్సనాలిటీ జాబితాలో మిత్ర పదో స్థానంలో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios