ఫేస్‌బుక్ డాటా లీక్ లో మార్క్ జుకర్‌బర్గ్ ఫోన్ నంబర్.. సిగ్నల్ యాప్ వాడుతున్నట్లు వెల్లడి..
ఫేస్‌బుక్ యూజర్ల డేటా మరోసారి హ్యాకింగ్‌కు గురి కావడం ఆందోళన రేపింది. అయితే ఇందులో ఏకంగా ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫోన్ నంబర్ కూడా ఉండటం గమనార్హం.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫోన్ నంబర్ లికైన ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాలో కనుగొనడం గమనార్హం.
ఇప్పటివరకు అతిపెద్ద డేటా లీక్‌లుగా ఉన్న వాటిలో ఫేస్‌బుక్ సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇతర వివరాలైన అతని పేరు, పుట్టిన తేదీ, లొకేషన్, వివాహ వివరాలు, ఫేస్‌బుక్ యూజర్ ఐడి కూడా డేటాలో వెల్లడయ్యాయని ఒక నివేదిక తెలిపింది.
అంతేకాదు మార్క్ జుకర్‌బర్గ్ సిగ్నల్ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లు లీక్‌లో వెల్లడైంది. దీని గురించి మరింత సమాచారం వెల్లడించిన భద్రతా పరిశోధకుడు లీకైన ఫోన్ నంబర్‌ను పోస్ట్ చేయడం ద్వారా ఫేస్‌బుక్ సీఈఓ సిగ్నల్ యాప్‌ను ఉపయోగిస్తున్నారని ధృవీకరించారు.
అలాగే 533 మిలియన్ల ఫేస్‌బుక్ వినియోగుదారుల వ్యక్తిగత వివరాలు లీకైనట్టు తెలిపారు. ఈ 533 మిలియన్ల ఫేస్ బుక్ యూజర్లలో 60లక్షలమంది భారతీయ వినియోగదారులు, అమెరికాకు చెందిన 32 మిలియన్లు యూజర్లు, యూకేకు చెందిన 11 మిలియన్ల యూజర్లు ఊన్నారు.
ఈ ఫోన్ నంబర్ల డేటాబేస్ హ్యాకర్ల ఫోరమ్‌లో పోస్ట్ చేసినట్టు నివేదించిన సంగతి తెలిసిందే. డేటా లీక్‌కు ప్రభావితమైన వారిలో ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకులు డస్టిన్ మోస్కోవిట్జ్ , క్రిస్ హ్యూస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
అలాగే మార్క్ జుకర్‌బర్గ్ లీకైన ఫోన్ నంబర్ స్క్రీన్ షాట్‌తో పాటు అతనికి సిగ్నల్ యాప్ లో ఖాతా ఉందంటూ ట్విట్ చేశారు.
ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానం పట్ల అసంతృప్తిగా ఉన్న చాలా మంది వినియోగదారులు సిగ్నల్ వంటి ప్రత్యామ్నాయా యాప్ లకు మారుతున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది. వాట్సాప్ కొత్త సర్వీస్ నిబంధనలు మే 2021 నుండి అమల్లోకి వస్తాయి.
మరొక భద్రతా నిపుణుడు అలోన్ గాల్ ప్రకారం, ఫేస్‌బుక్ ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నెంబర్ల ద్వారా ఈ హ్యాకింగ్ గత జనవరిలోనే జరిగిందన్నారు. దీనిపై స్పందించిన ఫేస్‌బుక్ ఇది పాత డేటా అని కొట్టిపారేసింది. అలాగే 2019 ఆగస్టులోనే ఈ లోపాన్ని సరిదిద్దామని పేర్కొంది.