న్యూఢిల్లీ: తమ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా పథకంతో దాదాపు సగానికి పైగా ఉద్యోగులు సంస్థ నుంచి వెళ్లిపోనున్నారు. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ తన కార్యకలాపాల కొనసాగింపునకు కావాల్సిన మానవ వనరులను సమకూర్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర టెలికాం మంత్రిత్వశాఖ ఆదేశించింది. 

ముఖ్యంగా రోజు వారీ కార్యకలాపాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్స్ఛేంజ్‌ల నిర్వహణ యథావిధిగా కొనసాగేలా చూడాలని సూచించింది. ఇందుకోసం వివిధ అవకాశాలను బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిశీలిస్తోంది. శుక్రవారం సాయంత్రం నాటికి బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసే ఉద్యోగుల్లో 57వేలమంది వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 

మరోపక్క ఎంటీఎన్‌ఎల్‌తో కలిపి ఈ సంఖ్య ఏకంగా 60 వేల మందిని దాటిపోయింది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసే దాదాపు లక్షమంది వీఆర్‌ఎస్‌కు అర్హులు. కాగా, 77వేలమంది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ ద్వారా పంపించేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

aslo read బీవేర్ ఆన్ వాట్సాప్: వాట్సాప్ గ్రూపు అడ్మిన్‌ బీ అలర్ట్

దీంతో 1.50లక్షల మందికి పైగా ఉన్న ఉద్యోగులను సగానికి సగం తగ్గించుకోవాలన్నది బీఎస్‌ఎన్‌ఎల్‌ వ్యూహం. తాజా పథకం జనవరి 31, 2020 వరకూ అమలులో ఉండనున్నందున సంస్థ నుంచి స్వచ్ఛందంగా మరికొంత మంది వెళ్లిపోయే అవకాశం ఉంది. 

‘ప్రస్తుత పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. డేటాను సేకరించడం ప్రారంభించాం. ఏ ఎస్‌ఎస్‌ఏ, ఏ యూనిట్‌.. ఎంతమంది వీఆర్‌ఎస్‌ తీసుకుంటున్నారు? తదితర వివరాలను సేకరిస్తున్నాం. దాదాపు 80 వేల మంది వీఆర్‌ఎస్‌ తీసుకుంటారని అనుకుంటున్నాం. ఈ సంఖ్య చిన్నదేం కాదు. మొత్తం ఉద్యోగుల్లో సగంమంది ఖాళీ అవుతారు. పని వాతావరణం పూర్తిగా మారిపోతుంది’’ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌, ఎండీ, పుర్వార్‌ తెలిపారు. 

2020 జనవరి 31 నాటికి 50 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయస్సు కలిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ శాశ్వత, రెగ్యులర్‌ ఉద్యోగులు.. డిప్యుటేషన్‌పై వేరే సంస్థలకు వెళ్లినవారు కూడా అర్హులే. సర్వీస్‌ పూర్తిచేసిన కాలానికి ఏడాదికి 35 రోజుల చొప్పున, ఇంకా ఉన్న పదవీ కాలానికి సంబంధించి ఏడాదికి 25 రోజుల చొప్పున ఎక్స్‌గ్రేషియా లెక్కించి, చెల్లిస్తారు.

మరోవైపు వీఆర్ఎస్ తర్వాత సిబ్బంది సగానికి పైగా తగ్గిపోయే అవకాశం ఉన్నందున రోజువారీ వ్యాపార లావాదేవీలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని బీఎస్ఎన్ఎల్ యాజమాన్యాన్ని అప్రమత్తం చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల టెలిఫోన్ ఎక్స్చేంజీల్లో అంతరాయాలు ఏర్పడకుండా చాడాలని నిర్దేశించింది. 

aslo read 4 రోజుల్లోనే గుడ్ రెస్పాన్స్: 60 వేలు దాటిన వీఆర్‌ఎస్‌

ప్రభుత్వ అంచనాల కంటే ఎక్కువ మేందే ఒకేసారి వీఆర్ఎస్ కింద వెళ్లిపోతారు కనుక కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడకుండా చూసే విషయమై టెలికం అధికారులు చర్చలు జరుపుతున్నారు.రోజువారీ వ్యవహారాలు, ఎక్స్చేంజీల సేవల్లో అంతరాయం ఏర్పడితే చందాదారుల్లో వ్యతిరేకత వస్తుంది. ఈ పొరపాట్లకు తావివ్వరాదన్నే ద్రుక్పథంతోనే యాజమాన్యం ఉంది. 

ఈ విషయమై సమాలోచనలు చేస్తున్నట్లు పేర్కొంది. వీఆర్ఎస్ తీసుకోగా మిగిలిన వారితో ఎలా పని చేయించుకోవాలనే యోచనలో ఉన్నట్లు బీఎస్ఎన్ఎల్ చైర్మన్ పీకే పూర్వార్ తెలిపారు. సిబ్బంది పనితీరు కూడా మారాల్సి ఉన్నదన్నారు. 

ప్రస్తుతం వీఆర్ఎస్ తీసుకుంటున్న వారిలో కొందరినీ కన్సల్టెంట్లుగా తక్కువ వేతనానికి తీసుకోవాలన్న యోచనలో బీఎస్ఎన్ఎల్ ఉంది. కొన్ని కార్యకలాపాలను పొరుగు సేవలకు అప్పగించాల్సి రావచ్చునని టెలికం శాఖ భావిస్తోంది. ఈ రంగంలోనే రిటైరైన అనుభవజ్నులకు పనులు అప్పగిస్తే తక్కువ ఖర్చులో మెరుగైన సేవలు లభించేలా చూడాలన్నది టెలికం శాఖ, భీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా ఉంది.