బెంగళూరు: ఇన్ఫోసిస్‌లో వేల మంది ఉద్యోగాలు పోతున్నాయి. మధ్య, సీనియర్ స్థాయిల్లో భారీగా ఉద్యోగ కోతలు ఉన్నాయని ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక చెబుతున్నది. ముఖ్యంగా జేఎల్6 (జాబ్ లెవల్ 6) శ్రేణిలో 10 శాతం ఉద్యోగులను తీసేయనున్నట్లు తెలుస్తున్నది. ఇన్ఫీలో జేఎల్6తోపాటు జేఎల్7, 8 శ్రేణుల్లో ప్రస్తుతం 30,092 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 2,200 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. 

also read తేల్చేసిన ఇన్ఫీ: నో ఎవిడెన్స్ ఆన్ ప్రజా వేగు కంప్లైంట్స్

జేఎల్6 అంటే సీనియర్ మేనేజర్ల స్థాయి ఉద్యోగుల విభాగం. ఇక జేఎల్3, అంతకంటే తక్కువ స్థాయితోపాటు జేఎల్4, 5 శ్రేణుల్లోనూ గరిష్ఠంగా 10 వేల మంది ఉద్యోగులపై వేటు పడనున్నది. ఈ శ్రేణుల్లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో ఇది 2-5 శాతానికి సమానం.

అసిస్టెంట్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుల హోదాలో ఉన్నవారినీ ఇన్ఫోసిస్  సాగనంపుతున్నది. ప్రస్తుతం సంస్థలో 971 సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నారు. వీరిలో 2-5 శాతం.. అంటే 50 మంది ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌బై చెప్పాలనుకుంటున్నది. కిందిస్థాయి ఉద్యోగులతోపాటు ఉన్నతస్థాయి ఉద్యోగులనూ టార్గెట్ చేస్తూ ఇన్ఫీ కోతలకు పదును పెట్టాలని చూస్తున్నది.

మరోవైపు ఉద్యోగుల తొలగింపు వార్తలు బయటకు రావడంతో మంగళవారం ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలకు గురయ్యాయి. ఒకానొక దశలో ఇన్ఫీ షేర్ విలువ 2.5 శాతం మేర పతనమైంది. గత వారం ఐటీ రంగ సంస్థ కాగ్నిజెంట్‌లోనూ 7 వేల ఉద్యోగుల తొలిగిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మధ్య నాటికి ఈ తొలగింపులు జరుగనుండగా, కొన్ని వ్యాపారాలకు, విధానాలకు స్వస్తి పలుకుతుండటంతో మరో 6 వేల ఉద్యోగుల భవిష్యత్తూ ప్రమాదంలో పడింది.

also read మెర్జర్ సరే.. బీఎస్ఎన్ఎల్ కు పొంచి ఉన్న దివాళా గండం

సంస్థాగత ఖర్చులను తగ్గించేందుకే ఇన్ఫోసిస్.. ఉద్యోగులను తొలగిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. అందుకే మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులను ఎంచుకున్నట్లు తెలుస్తున్నది. ఆర్థిక మందగమనంతో పడిపోయిన వ్యాపారం, సంస్థాగతంగా ఇటీవలి కాలంలో ఎదురవుతున్న ఇబ్బందుల నడుమ వ్యయ నియంత్రణ చర్యలకు ఇన్ఫీ దిగుతున్నది. 

దేశీయ ఐటీ రంగంలో రెండో అతిపెద్ద సంస్థగా ఇన్ఫోసిస్ ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఓ ఎగువ స్థాయి ప్రదర్శన కలిగిన సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్‌లో ప్రతీ పరిణామంపై అమితాసక్తి ఉంటుంది. సంస్థాగతంగా ఉద్యోగుల తొలగింపులు సర్వసాధారణం. దాన్ని ఆందోళనకరంగా చూడొద్దు అని ఇన్ఫోసిస్ పేర్కొంది.