ఇత‌ర గ్ర‌హాల‌పైకి ప్ర‌యాణం అన‌గానే హాలీవుడ్ మూవీస్ గుర్తొస్తాయి. కానీ ఇది త్వ‌ర‌లోనే సాకారం కానుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. 

యూకేకే చెందిన ప‌ల్స‌ర్ ఫ్యూజియ‌న్ అనే స్పేస్ స్టార్టప్ ఒక అద్భుతమైన రాకెట్ కాన్సెప్ట్‌ను విడుదల చేసింది. ఈ రాకెట్‌లో మార్స్‌లాంటి గ్ర‌హాల‌ను కూడా అత్యంత వేగంగా చేరుకోవ‌చ్చు. స‌న్‌బ‌ర్డ్ మైగ్రేట‌ర్ ట్రాన్స్‌ఫ‌ర్ వెహికిల్ పేరుతో ఈ రాకెట్‌ను లాంచ్ చేశారు.

ఈ రాకెట్ న్యూక్లియర్ ఫ్యూషన్ అనే అణు శక్తిని ఉపయోగించి పని చేస్తుంది. మన సూర్యుడిని శక్తివంతంగా ఉంచే ప్రక్రియ ఇదే. ఈ ఫ్యూషన్ శక్తితో 329,000 మైళ్ళ వేగంతో (సుమారు 5 లక్షల కిలోమీటర్లు గంటకు) ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. ఇది ఇప్పటి వరకు మనం రూపొందించిన అన్ని రాకెట్ల కంటే వేగంగా ప్ర‌యాణిస్తుంది.

స‌న్‌బ‌ర్డ్ రాకెట్‌లో డ్యూయ‌ల్ డైరెక్ష‌న్ ఫ్యూజియ‌న్ డ్రైవ్ ఇంజ‌న్స్‌ను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 500 కిలోమీటర్ల / సెకన్ వేగంతో ప్ర‌యాణించ‌వ‌చ్చు. ఇవి ప్రస్తుత కెమికల్ రాకెట్ల కన్నా చాలా వేగంగా, ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తాయి.

ఈ కంపెనీ 2027 నాటికి పూర్తిగా న్యూక్లియర్ ఫ్యూషన్‌తో పనిచేసే రాకెట్‌ను అంతరిక్షంలో పరీక్షించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇప్పట్లో కొన్ని ముఖ్యమైన భాగాల డెమోలను 2025లోనే చూపించనున్నారు. కంపెనీ CEO రిచర్డ్ డైనన్ తెలిపిన ప్రకారం, ఈ రాకెట్‌ను అంతరిక్ష రవాణా వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే దృష్టితో పని చేస్తున్నారు.

ఈ రాకెట్ స‌హాయంతో మార్స్ వరకు జీవన వసతులు, రోవర్లు, శాస్త్రీయ పరికరాలను తీసుకెళ్లవచ్చు. స్పేస్ లో టెలిస్కోపులు ఏర్పాటు చేయవచ్చు. ఆస్టారాయిడ్ మైనింగ్ వంటి భవిష్యత్ వ్యాపారాలకూ ఇది ఉపయోగపడొచ్చు. ఒక్కో స‌న్‌బ‌ర్డ్ రాకెట్ తయారీ ఖర్చు సుమారు 70 మిలియన్ డాలర్లు (దాదాపు ₹580 కోట్లకు పైగా). కానీ కంపెనీ చెబుతున్నదేమిటంటే – ఈ ఖర్చును ఒకటి లేదా రెండు సంవత్సరాల్లోనే తిరిగి పొందవచ్చు. దాని వల్ల ప్రయాణ వ్యయం తగ్గుతుంది, మిషన్ సమయం తగ్గుతుంది.

ఇది ఒకేసారి 1,000 నుంచి 2,000 కిలోల వరకు బరువు ఉన్న కార్గోను మోయగలదు. దీంతో ప్రభుత్వ అంతరిక్ష సంస్థలు, ప్రైవేట్ కంపెనీలకు ఇది ఉపయోగపడేలా ఉంటుంది. స‌న్‌బ‌ర్డ్ వాడ‌కాన్ని కేవలం మార్స్ వరకు పరిమితం చేయడం లేదు. దీని ద్వారా చంద్రుడు, ఇతర గ్రహాలకు మిషన్లు పంపించేందుకు ఉప‌యోగించ‌నున్నారు.

ఈ రాకెట్ మానవ జాతి అంతరిక్ష సాధనలో ఒక మైలురాయిగా నిలవనుంది. మార్స్ ప్రయాణాన్ని తక్కువ సమయానికి పరిమితం చేయగలిగితే, ఇది భవిష్యత్తులో ఆర్థికంగా కూడా ప్రయోజనకరంగా మారుతుంది.