పానీపూరీ అమ్ముతూ జీవనం సాగించే యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఐపిఎల్ తో బూరెల బుట్టలో పడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ.2.40 కోట్లకు ఐపిఎల్ యాక్షన్ లో కొనుగోలు చేసింది.

కోల్ కతా: పూట గడవడమే కష్టంగా ఉన్న స్థితి నుంచి ఐపిఎల్ కారణంగా ఓ యువ క్రికెటర్ కోటీశ్వరుడయ్యాడు. రెండేళ్ల క్రితం వరకు ముంబై వీధుల్లో జీవనభృతి కోసం అతను ఒకప్పుడు పానీ పూరీ అమ్మేవాడు. అతడిలోని ప్రతిభను గుర్తించి, అతని దుర్భర స్థితిని గమనించి కోచ్ జ్వాలా సింగ్ ఆదుకోవడంతో అతను క్రికెట్ మీద దృష్టి పెట్టాడు. దాంతో ఇప్పుడు అతన్ని రాజస్థాన్ రాయల్స్ రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది.

అతనెవరో కాదు, ఉత్తరప్రదేశ్ కు చెందిన యశస్వి జైస్వాల్. ఈ 17 ఏళ్ల ముంబై క్రికెటర్ దేశవాళీ క్రికెట్ లో అత్యంత వేగంగా ముందుకు దూసుకొచ్చాడు. పరిమిత 50 ఓవర్ల మ్యాచులో డబుల్ సెంచరీ చేసి, ఆ ఘనతను సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. దాంతో అతని పేరు వెలుగులోకి వచ్చింది. 

Also Read: ఐపిఎల్ కు హైదరాబాద్ కుర్రాడు: ఎవరీ సందీప్?

ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో జైస్వాల్ ఆ ఘనతను సాధించాడు. అతని బేస్ ప్రైస్ రూ.20 లక్షలు కాగా, రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. క్రికెటర్ కావాలనే లక్ష్యంతో ముంబై చేరుకున్న యశస్వి ఆజాద్ మైదానంలోని ముంబై యునైటెడ్ క్లబ్ టెంట్ లో మూడేళ్లు గడిపాడు. పానీపురి అమ్మి జీవనం సాగించేవాడు. 

రంజీ ట్రోఫీ క్రికెట్ లో కీలకమైన ఆటగాడిగా ఎదిగిన యశస్వి ప్రస్తుతం అండర్ 19 జట్టులో కొనసాగుతున్నాడు. ఐపిఎల్ అతన్ని కోటీశ్వరుడిని చేసింది.