హైదరాబాద్: హైదరాబాదుకు చెందిన యువ క్రికెటర్ బావనక సందీప్ కు ఐపిఎల్ లో ఆడే అవకాశం దక్కింది. గురువారం కోల్ కతాలో జరిగిన ఐపిఎల్ - 2020 సీజన్ కు జరిగిన వేలం పాటలో హైదరాబాదుకు చెందిన సందీప్ ను సన్ రైజర్స్ హైదరాబాదు కొనుగోలు చేసింది. 

సందీప్ ను రూ.20 లక్షల బేస్ ప్రైస్ కు సన్ రైజర్స్ హైదరాబాదు సొంతం చేసుకుంది. సందీప్ పూర్తి పేరు బావనక పరమేశ్వర్ సందీప్. అతను హైదరాబాదులోని రాంనగర్ కు చెందినవాడు. తండ్రి పరమేశ్వర్, తల్లి ఉమారాణి. 

సందీప్ 1992 ఏప్రిల్ 25వ తేదీన జన్మించాడు. 2010లో సందీప్ 18 ఏళ్ల వయస్సులో రంజీ మ్యాచులో రంగప్రవేశం చేశాడు. మొదటి మ్యాచులోని జార్ఖండ్ పై సెంచరీ చేసి రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు 54 రంజీ మ్యాచులు ఆడి 48.5 సగటుతో కొనసాగుతున్నాడు. 

సందీప్ ఇప్పటి వరకు 7 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, 21 అర్థ సెంచరీలు చేశఆడు. ప్రస్తుతం హైదరాబాద్ రంజీ జట్టు వైఎస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. సందీప్ బౌలింగ్ కూడా చేయగలిగాడు. విజయ్ హజారే 50 ఓవర్ల టోర్నీలో హైదరాబాద్ నుంచి 14 వికెట్లు తీసి ఆల్ రౌండ్ ప్రతిభను కనబరిచాడు. 

సందీప్ తండ్రి పరమేశ్వర్ కుమారుడి కేరీర్ కోసం చాలా శ్రమించాడు. భారత్ డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్)లో ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుని కుమారుడి కోసం సమయాన్ని వెచ్చించారు. ఏడేళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. 

సందీప్ నాలుగేళ్ల వయస్సులో అతని బ్యాటింగ్ స్టైల్ ను మార్చడంలో కూడా తండ్రిదే పాత్ర. రైట్ హ్యాండ్ బ్యాటింగ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ కు మార్చడంలో ఆయనదే పాత్ర.