Asianet News TeluguAsianet News Telugu

చేజేతులా పారేసుకున్నారు ..టీమిండియా ఓటమికి కారణాలివేనా..?

బలమైన బ్యాటింగ్ లైనప్.. స్వింగ్, స్పిన్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసే బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో భారత్ పటిష్టంగా ఉంది. కానీ ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ చేజేతులా పొగొట్టుకుంది

why India lost the ODI series

క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు బలమైన జట్టు ఏదైనా ఉందంటే అది కచ్చితంగా టీమిండియానే అని ఒప్పుకుంటారు క్రికెట్ పండితులు. భీకర ఫామ్‌లో ఉన్న కుర్రాళ్లు.. బలమైన బ్యాటింగ్ లైనప్.. స్వింగ్, స్పిన్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసే బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో భారత్ పటిష్టంగా ఉంది. కానీ ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ చేజేతులా పొగొట్టుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది.

టీమిండియాకు వన్డేల్లో వరుసగా తొమ్మిది సిరీస్ విజయాల తర్వాత ఇదే తొలి ఓటమి. టీ20 సిరీస్ విజయం తెచ్చిన ఊపులో వన్డే సిరీస్‌ను కూడా కోహ్లీ సేన గెలుచుకుంటుందని అందరూ భావించారు. అందుకు తగ్గట్టుగా తొలి వన్డేలో మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆ తర్వాత భారత ఆటగాళ్లలో అలసత్వం పెరిగిపోయింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం మనదేలే అనుకుని ప్రత్యర్థిని తక్కువ అంచనా వేశారు. దీని తాలూకూ లక్షణాలన్ని రెండవ వన్డేలో బయటపడ్డాయి..

బద్ధకమైన బ్యాటింగ్, చెత్త బౌలింగ్‌తో రెండో వన్డేలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. వికెట్ కీపర్ ధోని బ్యాటింగ్ చూస్తే  ఆ విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. ఇక తప్పక గెలవాల్సిన మూడో వన్డేలో కూడా టీమిండియా ఆటగాళ్లు నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించాల్సిన ఓపెనర్లు.. ఆచితూచి బ్యాటింగ్ చేశారు.. ముఖ్యంగా రోహిత్ శర్మ బాగా తడబడ్డాడు.. విల్లీ వేసిన తొలి  ఓవర్‌ను మెయిడిన్‌గా ఆడిన అతను.. మళ్లీ ఆ తర్వాత డాట్ బంతులు ఎదుర్కొని వికెట్ సమర్పించుకున్నాడు.

స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటారని పేరున్న భారత బ్యాట్స్‌మెన్ ఆ స్పిన్ మాయాజాలంలో ఇరుక్కుపోయారు. ముఖ్యమంగా  రషీద్ బౌలింగ్‌ను ఏమాత్రం ఆడలేకపోయారు. ఇక భారత బౌలింగ్‌ ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్లేదు.. ముఖ్యంగా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ షార్ట్ పిచ్ బంతులేసి ధారాళంగా పరుగులిచ్చాడు. స్పిన్నర్లు కుల్‌దీప్, చాహల్ కూడా విఫలమవ్వడం.. ఇలా అన్ని కలిసి వచ్చి భారత్‌కు సిరీస్ పరాజయాన్ని అందించింది. 2016 జనవరి తర్వాత భారత్‌కు ఇదే తొలి వన్డే  సిరీస్ ఓటమి.

Follow Us:
Download App:
  • android
  • ios