టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గడ్డం గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. విరాట్ తన గడ్డానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నారంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ ఇటీవల కేఎల్ రాహుల్ ఓ వీడియోని కూడా ట్వీట్ చేశాడు. 

దీంతో నిజంగానే కోహ్లీ తన గడ్డానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నారనే అనుకున్నారంతా. కాగా.. ఈ వార్తలకు కోహ్లీ పులిస్టాప్ పెట్టాడు.తాజాగా దీనిపై కోహ్లీ అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. తాను గడ్డానికి బీమా చేయించుకోలేదని.. అదంతా ఓ యాడ్‌లో భాగమని తెలిపాడు.

శనివారం విలేకరుల సమావేశంలో పాల్గొన్న కోహ్లీకి తన గడ్డానికి బీమా చేయించుకున్నారన్న వార్తపై ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘గత కొద్ది రోజులుగా చాలా మంది నా గడ్డం గురించి మాట్లాడుకుంటున్నారు. గడ్డానికి బీమా చేయించుకున్నానంటూ వస్తోన్న వార్తలపై చాలా మందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే నేను నా గడ్డానికి ఎలాంటి బీమా చేయించుకోలేదు. ఇదంతా ఓ యాడ్‌లో భాగం మాత్రమే’ అని కోహ్లీ బదులిచ్చాడు. తాజాగా కోహ్లీ ఫిలిప్స్‌ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఐపీఎల్‌లో మెడకు అయిన గాయంతో బాధపడుతోన్న కోహ్లీ బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. శుక్రవారం కోహ్లీ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్‌ పరీక్ష ఎదుర్కోనున్నాడు. ఈ నెల చివరి వారంలో కోహ్లీ టీమిండియాతో కలిసి ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నాడు.