నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లతో హర్మన్ ప్రీత్ మోసం..? డీఎస్పీ ర్యాంక్ తొలగింపు

First Published 10, Jul 2018, 12:05 PM IST
Team india women T20 Captain Harmanpreet Kaur's DSP rank withdrawn over fake degree
Highlights

టీమిండియా మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ప్రభుత్వానికి సమర్పించిన డిగ్రీ సర్టిఫికేట్లు నకిలీవని పోలీసులు తేల్చడంతో.. ఆమె డీఎస్పీ ర్యాంక్ హోదాను తొలగిస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది

టీమిండియా మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేశారు.. ప్రభుత్వానికి ఆమె సమర్పించిన డిగ్రీ సర్టిఫికేట్లు నకిలీవని పోలీసులు తేల్చడంతో ఆమె డీఎస్పీ ర్యాంక్ హోదాను తొలగిస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

గతేడాది ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన మహిళ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా సెమీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ అద్భుతంగా ఆడారు.. సెంచరీ సాధించి భారత్‌ను ఫైనల్స్‌కే చేర్చారు. దీంతో యావత్ దేశం ఆమెను ప్రశంసల్లో ముంచెత్తింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రప్రభుత్వాలు ఆమెకు అవార్డులు, రివార్డులు ప్రకటించాయి. ఈ క్రమంలో పంజాబ్ ప్రభుత్వం కూడా ఆమెకు డీఎస్సీ హోదాను ప్రకటించింది.

ఈ ఏడాది మార్చి 1న ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ సమక్షంలో ఆమె బాధ్యతలు సమర్పించారు. విద్యార్హతలు ప్రభుత్వానికి సమర్పించే పక్షంలో 2011లో తాను చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటి నుంచి డిగ్రీ పాసైనట్లు పోలీస్ శాఖకు ధ్రువపత్రాలు సమర్పించారు. అది నకిలీదని ఆరోపణలు రావడంతో పోలీస్ శాఖ విచారణకు ఆదేశించింది. దీనిలో అది నకిలీదని తేలింది..దీంతో హర్మన్‌ప్రీత్ డీఎస్సీ ర్యాంక్‌ను తొలగిస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది.

ఆమె కేవలం 12వ తరగతి మాత్రమే పాస్ అయినట్లుగా తెలుస్తున్నందున... ఆమె అర్హతకి కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఓ అధికారి అన్నారని వార్తలు వస్తున్నాయి. కాగా, ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చట్టపరంగా హర్మన్‌ప్రీత్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. ఈ కేసులో ఎఫ్ఐఆర్ కనుక నమోదు చేస్తే.. ఆమె అందుకున్న అర్జున అవార్డును కూడా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. మరో వైపు హర్మన్‌ప్రీత్ ఇదే సర్టిఫికేట్‌తో రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారని.. అలాంటప్పుడు అది నకిలీ సర్టిఫికేట్‌ ఎలా అవుతుందని హర్మన్ ప్రీత్ మేనేజర్ ప్రశ్నించారు.


 

loader