ఆస్ట్రేలియాతో విశాఖలో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరాజయానికి ఉమేశ్ యాదవే కారణమంటూ అతనిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలో తన సహచరుడికి మరో పేసర్ బుమ్రా మద్ధతుగా నిలిచాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చాలా కష్టమని... కొన్నిసార్లు ఫలితం అనుకూలంగా వస్తే.. మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉండవచ్చన్నాడు.

తాము విజయం అంచుల వరకు వచ్చి దానికి అందుకోలేకపోవడం బాధకరమే అయినప్పటికీ, ఎవరూ కావాలని పరుగులు ఇవ్వరు కదా అంటూ ఉమేశ్‌ను వెనకేసుకొచ్చాడు.

బ్యాటింగ్‌లో తాము బాగా విఫలమయ్యామని, కనీసం 140 నుంచి 145 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి ఉంటే విజయం సాధించేవాళ్లమని బుమ్రా ఆశాభావం వ్యక్తం చేశాడు.

కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్కోరు మందగించిందన్నాడు. అదే తమ ఓటమిపై ప్రభావం చూపించిందని బుమ్రా పేర్కొన్నాడు. విశాఖ టీ20లో ఆసీస్ విజయానికి 14 పరుగులు అవసరం చేతిలో 6 బంతులు ఉన్నాయి.

ఈ క్రమంలో బౌలింగ్‌కు వచ్చిన ఉమేశ్ యాదవ్ రెండు ఫోర్లు సమర్పించుకోవడంతో పాటు చివరి బంతిని సైతం సరిగా వేయలేక ఆస్ట్రేలియాకు విజయాన్ని కట్టబెట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 126 పరుగులు మాత్రమే చేసింది. 

ఉమేష్ యాదవ్ విలన్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్