హైదరాబాద్: ఈజిప్ట్, సౌదీ అరేబియా మధ్య సోమవారం నాటి మ్యాచ్ చూసినవారికి ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో సౌదీ అరేబియా తరహాలో ఇంజూరీ టైమ్‌ను విజయానికి అనువుగా మలచుకున్న టీమ్ మరొకటి ఉండదేమో అనిపిస్తుంది. అదీ ఫస్టాఫ్ మరియు సెకండాఫ్‌లో ఇంజూరీ టైమ్‌ లాస్ట్ మూమెంట్‌లో అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అన్నట్టుగా రెండు గోల్స్ చేసింది. 2-1తో ఈజిప్ట్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈజిప్ట్ మిడ్ ఫీల్డర్ మహ్మద్ సలా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.


మ్యాచ్ సాగిన తీరును పరిశీలిస్తే.. ఫస్టాఫ్‌లో మహ్మద్ సలా 22వ నిముషం వద్ద అత్యంత చాకచక్యంగా గోల్ చేయడం ద్వారా ఈజిప్ట్‌కు 1-0తో ఆధిక్యత సంపాదించి పెట్టాడు. సౌదీ అరేబియాకు 41వ నిముషంలో పెనాల్టీ కిక్ రూపంలో బ్రహ్మాండమైన ఛాన్స్ వచ్చింది. కానీ ఫహద్ అల్ మువల్లాద్ దాన్ని గోల్‌గా మార్చుకోవడంలో విఫలమయ్యాడు. ఇక ఇంజూరీ టైమ్‌కు వచ్చేసరికి చివరి సెకన్లలో సౌదీ అరేబియా మిడ్ ఫీల్డర్ సల్మాన్ అల్ ఫరజ్ గోల్ చేయడం ద్వారా 1-1తో స్కోర్ సమం చేశాడు. సెకండాఫ్‌కు వచ్చేసరికి ఇంజూరీ టైమ్‌లో మిడ్ ఫీల్డర్ సలేమ్ అల్ దవ్సారీ గోల్ చేయడం ద్వారా 2-1తో సౌదీ అరేబియాకు చరిత్రాత్మకమైన విజయాన్ని అందించాడు.