భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయి రాజ్- చిరాగ్ శెట్టిలు చరిత్ర సృష్టించారు. సూపర్ 1000 ఈవెంట్‌లో డబుల్స్ నెగ్గిన తొలి భారత జంటగా వీరిద్దరూ రికార్డుల్లోకెక్కారు.
భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయి రాజ్- చిరాగ్ శెట్టిలు చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్ ఫైనల్‌లో ఆదివారం మలేషియా జోడీ ఆరోన్ చియా- సో వుయిక్‌పై సాత్విక్ సాయి రాజ్- చిరాగ్ శెట్టిలు విజయం సాధించారు. వరుస సెట్లలో 21-17, 21-18 తేడాతో ఈ జోడీ విజయం సాధించింది. అంతేకాదు.. సూపర్ 1000 ఈవెంట్‌లో డబుల్స్ నెగ్గిన తొలి భారత జంటగా వీరిద్దరూ రికార్డుల్లోకెక్కారు. ఇప్పటికే వీరి ఖాతాలో ప్రపంచ ఛాంపియన్‌షిప్, థామస్ కప్, కామన్‌వెల్త్ గేమ్స్ మెడల్స్ వున్నాయి.
ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఏషియానెట్ న్యూస్‌తో మాట్లాడుతూ.. తన కోచింగ్ కెరీర్‌లో ఇది అత్యంత సంతృప్తికరమైన క్షణాలలో ఒకటి అని చెప్పారు. ఇది గెలుపు కంటే.. అద్భుతమని పేర్కొన్నారు. భారత ఆటగాళ్లు టోర్నమెంట్‌లో ఆడిన విధానం చాలా అద్భుతంగా ఉందని అన్నారు. ప్రపంచ నెంబర్ 1 జోడీని అంత సులభంగా ఓడించడం భారత బ్యాడ్మింటన్‌కు శుభసూచకమని అన్నారు. ‘‘మా టీమ్ అందరికి అభినందనలు’’ అని పుల్లెల గోపిచంద్ పేర్కొన్నారు.
ఇక, అంతకుముందు ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్ సెమీ-ఫైనల్స్‌ల సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి దక్షిణ కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్- సియో సెయుంగ్ జేపై 17-21, 21-19, 21-18తో విజయం సాధించారు.
