టీమిండియాలో స్థానం సంపాదించాలనుకునే ప్రతీ క్రికెటర్ యోయో టెస్టులో పాస్ అవ్వాలన్న విధానం విమర్శల పాలవుతోంది. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో ఆటగాళ్లకు నిర్వహిస్తున్న యోయో టెస్టులో భారత ఆటగాళ్లు ఒక్కొక్కరికి  విఫలమవుతున్నారు. ఇప్పటికే  అంబటి రాయుడు, మహమ్మద్ షమీ, సంజు శాంసన్‌ యోయో టెస్టులో విఫలమై ఇంగ్లండ్ వెళ్లే చాన్స్ కోల్పోయారు.

దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన రాయుడు.. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ అదరగొట్టాడు. అయితే, యోయో టెస్టులో విఫలం కావడంతో అంబటిని జట్టు నుంచి తప్పించారు. అయితే అత్యద్భుత ఆటతీరుతో జాతీయ జట్టులో స్థానం కోసం ఆశగా ఎదురుచూస్తోన్న వారి పట్ల యోయో టెస్ట్ శరాఘాతంగా మారిందని పలువురు మాజీలు మండిపడుతున్నారు.

తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అర్థగంటలో ఓ ఆటగాడి సత్తాను ఎలా అంచనా వేస్తారని ఆయన ప్రశ్నించాడు. టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో విఫలమైన ఆటగాడికి రెండో ఇన్నింగ్స్‌లో నిరూపించుకునే అవకాశం ఉంటుందని.. ఇక్కడ కూడా యోయో టెస్టులో ఫెయిలైతే గంటల వ్యవధిలో అతనికి మరో అవకాశం ఇవ్వాలని సందీప్ కోరాడు. ఇది క్రికెటర్ల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నాడు.