సాకర్ వరల్డ్ కప్ సందర్భంగా మహిళలకు రష్యా సూచన

మాస్కో: సాకర్‌ వరల్డ్‌ కప్‌ సందర్భంగా రష్యా మహిళలు శ్వేతజాతియేతర విదేశీయులతో శృంగారంలో పాల్గొనకూడదని ఓ ప్రజా ప్రతినిధి సూచించారు. ఒకవేళ అలా చేస్తే పిల్లలతో సింగిల్‌ మదర్‌గా మహిళలు మిగిలిపోయే అవకాశముందని అన్నారు.


 రష్యా మహిళలు విదేశీయులతో చేసుకుంటున్న వివాహ సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయని ఆయన గుర్తు చేశారు. రష్యా మహిళలు విదేశాల్లో చిక్కుకుపోవడం, వారి పిల్లలు విదేశాల్లో ఉండటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని సీనియర్‌ చట్టసభ సభ్యురాలు కుటుంబ వ్యవహారాలు, మహిళా శిశు పార్లమెంటు కమిటీ చైర్మన్‌ తమరా ప్లెట్‌న్యోవా అభిప్రాయపడ్డారు. 

1980లో మాస్కో ఒలింపిక్స్‌ సందర్భంగా విదేశీయులతో సంబంధాల కారణంగా రష్యా మహిళలు పిల్లలను కన్నారు. అప్పట్లో గర్భనిరోధక పద్ధతులు అంతగా అందుబాటులో లేకపోవడంతో ఇలా పుట్టిన చిన్నారులు ‘ఒలింపిక్‌ పిల్లలు’గా ముద్రపడ్డారు. అంతర్జాతీయ క్రీడల సందర్భంగా ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, ఆసియా పురుషులతో సంబంధాల వల్ల రష్యా మహిళలకు పుట్టిన శ్వేతజాతియేతర పిల్లలను పిలిచేందుకు సోవియట్‌ హయాంలో ఈ పదాన్ని వాడేవారు. ఈ పిల్లలు రష్యాలో వివక్షను ఎదుర్కొన్నారు.