మెల్బోర్న్: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్లాట్ విషయంలో భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయమే సరైందని తేలింది. ధోనీని నాలుగో స్టాట్ లో దింపాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఆయన కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయంతో విభేదించాడు.

నాలుగో స్థానంలో అంబటి రాయుడు కుదురుకున్నప్పటికీ ధోనీయే ఆ స్థానానికి సరైన ఆటగాడని రోహిత్ శర్మ అన్నాడు. ఇది తన వ్యక్తిగతమైన అభిప్రాయమని చెబుతూ తుది నిర్ణయం కోచ్, కెప్టెన్లదేనని అన్నాడు. 

సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో వన్డేలో ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. ఈ మ్యాచ్ నుంచి అంబటి రాయుడిని తప్పించారు. అంబటి రాయుడి స్థానంలో బ్యాటింగ్ కు దిగిన ధోనీ నిలకడగా ఆడి భారత్ కు విజయాన్ని అందించాడు. భారత్ ఏడు వికెట్ల తేడాతో మూడో వన్డేను సొంతం చేసుకుని సిరీస్ ను గెలుచుకుంది. 

ఆస్ట్రేలియా 230 పరుగులు చేయగా, భారత్ మూడు వికెట్లు నష్టపోయి 234 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.  ఓపెనర్లు త్వరగా ఔటైన నేపథ్యంలో ధోనీ నింపాదిగా ఆడుతూ భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. అతను 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ప్రపంచ కప్ టోర్నమెంటులో ధోనీకి స్థానం ఉంటుందా, లేదా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ధోనీ రెండు వరుస మ్యాచుల్లో అర్థ సెంచరీలు చేయడమే కాకుండా ఈ రెండు వన్డేలు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అతని బ్యాటింగ్ విజయానికి తోడ్పడింది. ధోనీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా కూడా ఎంపికయ్యాడు.

అస్ట్రేలియాపై వన్డే సిరీస్ ను గెలుచుకున్న నేపథ్యంలో ధోనీకి ప్రపంచ కప్ ఆడే టీమిండియా జట్టులో బెర్త్ ఖాయమైనట్లే. ఆయన స్లాట్ కూడా దాదాపుగా ఖరారైనట్లు భావించవచ్చు. ఇదే జరిగితే అంబటి రాయుడు తుది జట్టులో స్థానం కోల్పోయే అవకాశాలు లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ