Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

ఆస్ట్రేలియా గడ్డపై ఆతిథ్య జట్టును మట్టి కరిపించి టెస్టు సిరీస్ ను గెలుచుకున్న కోహ్లీ సేన వన్డే సిరీస్ ను కూడా గెలుచుకుని తనకు తిరుగులేదని నిరూపించుకుంది. చివరి రెండు వన్డే మ్యాచులో విజయంలో ధోనీ కీలక పాత్ర పోషించాడు. 

India vs Australia, 3rd ODI, Live Updates
Author
Melbourne VIC, First Published Jan 18, 2019, 7:43 AM IST

ఆస్ట్రేలియాపై మూడో వన్డేలో భారత్ విజయం సాధించి, మూడు మ్యాచుల సిరీస్ ను 2-1 స్కోరుతో సొంతం చేసుకుంది. మూడో వన్డేను ఏడు వికెట్ల తేడాతో గెలుచుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన సత్తా చాటి భారత్ కు విజయాన్ని అందించాడు. అతను 114 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేదార్ జాదవ్ 57 బంతుల్లో 61 పరుగులు చేశాడు. చివరలో విజయానికి ఒక్క పరుగు కావాల్సి ఉండగా కేదార్ జాదవ్ ఫోర్ బాదాడు. దీంతో భారత్ ఆస్ట్రేలియా తన ముందు ఉంచిన 231 పరుగుల లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది.భారత్ 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో రిచర్డ్సన్, సిడిల్, స్టోయినిస్ తలో వికెట్ తీసుకున్నారు. 

ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ ను ఆస్ట్రేలియా గడ్డపై గెలుచుకున్న భారత్ వన్డే సిరీస్ ను కూడా గెలుచుకుని చరిత్ర సృష్టించింది. కోహ్లీ సేనకు ఇది అత్యంత విలువైన, ఘనమైన విజయమనే చెప్పాలి. మరోసారి ధోనీ తాను మ్యాచ్ విన్నర్ నని నిరూపించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోని, కేదార్ జాదవ్ అద్భుతమైన హాప్ సెంచరీలతో భారత్ ను విజయానికి చేరువ చేశారు. చాహెల్ తన అద్భుతమైన బౌలింగ్ తో ఆరు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదీ మూడోది అయిన వన్డే మ్యాచులో మహేంద్ర సింగ్ ధోనీ అంతకు ముందు ఆర్థ సెంచరీ చేశాడు. 74 బంతుల్లో అతను 50 పరుగులు చేశాడు. రెండో వన్డేలో అర్థ సెంచరీతో భారత్ కు విజయాన్ని అందించిన అతను మూడో వన్డేలోనూ అర్త సెంచరీ చేసి తన అనుభవాన్ని చాటుకున్నాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ మిస్సయ్యాడు. అతను 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిచర్జ్సన్ బౌలింగులో వెనుదిరిగాడు. దీంతో భారత్ 113 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

టీమిండియా శిఖర్ ధావన్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్‌ను స్టోయినిస్ ఔట్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 28 పరుగులతోనూ, ధోనీ 5 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. ఆసీస్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

సిరీస్‌లో ఫుల్ ఫాంలో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ అతి తక్కువ పరుగులకే ఔటయ్యాడు.  సిడెల్ బౌలింగ్‌లో షాన్ మార్ష్‌కి క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. అప్పటికి భారత్ 7 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. భారత్ ముందు 231 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో 230 పరుగులకు అలౌటైంది. హ్యాండ్స్‌కాంబ్ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చాహల్ 6 వికెట్లు తీసి ఆసీస్ నడ్డి విరిచాడు. భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ రెండేసి వికెట్లు పడగొట్టారు. 

అంతకు ముందు 219 పరుగుల వద్ద స్ట్రేలియా 8వ వికెట్ కోల్పోయింది. 58 పరుగుల వద్ద హ్యాండ్స్ కాంబ్ పెవిలియన్ చేరాడు. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విధ్వంసకర ఆటగాడు మాక్స్‌వెల్ షమీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆట ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్ అలెక్స్ కారె..భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఆ తర్వాత కాసేపటికే ఫించ్‌ను కూడా భువీ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజాతో కలిసిన షాన్‌మార్ష్‌ దూకుడుగా ఆడుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ క్రీజులో కుదురుకుంటున్న సమయంలో చాహాల్ వరుస బంతుల్లో వీరిని పెవిలియన్‌కు చేర్చాడు.దీంతో 73 పరుగుల 3వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

అనంతరం పీటర్ హ్యాండ్స్‌కాంబ్ - మార్కస్ స్టోయినిస్ జోడీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినప్పటికీ చాహాల్ మాయాజాలానికి స్టోయినిస్ బలయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుస ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 19 బంతుల్లో 26 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న మాక్స్‌వెల్‌ను షమీ ఎట్టకేలకు బోల్తా కొట్టించాడు.

టాస్ గెలిచిన భారత సారథి విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ జరిగిన తర్వాతి నుంచి వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. ఇప్పటికే ఇరు జట్లు 1-1తో సమంగా నిలబడంతో సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఆఖరి వన్డేలో గెలిచి చరిత్ర సృష్టించాలని భారత్, వన్డే సిరీస్‌ను నెగ్గి పరువు కాపాడుకోవాలని ఆసీస్ కృతనిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే. 

 

Follow Us:
Download App:
  • android
  • ios