ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో పాట్నా పైరేట్స్ మొదటిసారి అత్యుత్తమ ఆటతీరు కనబర్చింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఈ మాజీ ఛాంపియన్ జట్టు పాయింట్స్ టేబుల్ చివరన నిలిచిన విషయం తెలిసిందే. అయితే కోల్‌కతాలోని నేతాజి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మాత్రం తమ మునుపటి ఆటతీరును కనబర్చింది. తమిళ్ తలైవాస్ ను 26 పాయింట్ల భారీ తేడాతో మట్టికరిపించి తమలో ఛాంపియన్ ఇంకా దాగున్నాడని నిరూపించుకుంది. మరీముఖ్యంగా స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి 26 పాయింట్లు అందించడంతో పైరేట్స్ సునాయాసంగా విజయతీరాలకు చేరుకుంది. 

పాట్నా టీం కేవలం రైడింగ్ లోనే 30 పాయింట్లు సాధించగా అందులో 26 ఒక్క ప్రదీప్  సాధించినవే. మిగతావారిలో  జయదీప్ 7, హది 4, నీరజ్ 2, మోను 2 పాయింట్లు సాధించారు.ఇలా  ట్యాకిల్స్ లో 14, ఆలౌట్ల ద్వారా 8, ఎక్స్‌ట్రాల రూపంలో 1 మొత్తం 51 పాయింట్లు సాధించి పైరేట్స్ తిరుగులేని ఆధిక్యాన్ని  ప్రదర్శించింది. 

ఇక తమిళ్ తలైవాస్ విషయానికి వస్తే కేవలం 25 పాయింట్లవద్దే చేతులెత్తేసింది. రైడింగ్ లో 18 పాయింట్లతో ఫరవాలేదనిపించినా ట్యాకిల్స్ లో మాత్రం కేవలం 6 పాయింట్లతో ఘోరంగా విఫలమయ్యింది. ఆటగాళ్ళలో అజిత్ 10, రాహుల్ చౌదరి 5, వినీత్ 3, సాగర్ 3 పాయింట్లు సాధించినా పాట్నా ఆటగాళ్ల  ముందు నిలవలేకపోయారు.. దీంతో చివరకు 51-25 పాయింట్ల తేడాతో తలైవాస్ ఓటమిని  చవిచూసింది.