ప్రో కబడ్డి లీగ్ 2019 లో పాట్నా పైరేట్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతూ పాయింట్స్ టేబుల్ చివరన నిలిచిన ఆ జట్టు మరో ఓటమిని చవిచూసింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ చేతిలో కేవలం 5 పాయింట్ల తేడాతో పైరేట్స్ పరాజయంపాలయ్యింది. స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ 17 పాయింట్లతో రాణించినా పైరేట్స్ ను గెలిపించలేకపోయాడు. 

జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్, పాట్నా పైరేట్స్ లు హోరాహోరీగా తలపడ్డాయి.  అయితే పాట్నా కేవలం 34 పాయింట్లతోనే సరిపెట్టుకోగా హర్యానా మాత్రం 39 పాయింట్లు సాధించింది. ఇలా 5 పాయింట్ల తేడాతో హర్యానా జట్టు విజేతగా నిలిచింది. 

 హర్యానా ఆటగాళ్లలో వికాస్ 13, ప్రశాంత్ 6, వినయ్ 5 రాణించారు. వీరికి రవికుమార్ 3, సునీల్ 3, కుల్దీప్ 2 పాయింట్లతో సహకారం అందించారు. దీంతో రైడింగ్ లో 24, ట్యాకిల్స్ లో 8, ఆలౌట్ల ద్వారా 6, ఎక్స్ ట్రాల రూపంలో 1 మొత్తం 39 పాయింట్లతో హర్యానా విజయాన్ని అందుకుంది. 

ఇక పాట్నా విషయానికి వస్తే స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ 17 పాయింట్లతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడికి లీ జంగ్ 7, నీరజ్ 3, మహ్మద్ ఇస్మాయిల్ 3, జయదీప్ 2 పాయింట్లతో సహకరించారు. అయినప్పటికి రైడింగ్ లో 28, ట్యాకిల్స్ లో 6, ఎక్స్‌ట్రాల రూపంలో 1 మొత్తం 34 పాయింట్లు మాత్రమే చేయగలింది. దీంతో కేవలం 5 పాయింట్ల తేడాతో మరో ఓటమిని పాట్నా పైరేట్ప్ తన ఖాతాలో వేసుకుంది.