హోం గ్రౌండ్...సొంత ప్రేక్షకుల మధ్యలో జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ 2019 లో  బెంగాల్ వారియర్స్ మరో విజయాన్ని అందుకుంది. బలమైన బెంగళూరు బుల్స్ తో చివరివరకు పోరాడి వారియర్స్ కేవలం 2 పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది. బుల్స్ స్టార్ రైడర్ పవన్ కుమార్ 19 పాయింట్లతో అద్భుతంగా పోరాడినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. 

బెంగాల్ ఆటగాళ్లలో  మణీందర్ సింగ్ 17, ఇస్మాయిల్ 9, సుఖేష్ 5 పాయింట్లతో అదరగొట్టారు.  వీరి ముగ్గురే బెంగాల్ కు విజయాన్ని సాధించిపెట్టారు. మిగతా ఆటగాళ్లు ఆశించిన మేర రాణించకున్నా వీరి పోరాటం మూలంగా వారియర్స్ అభిమానులు నిరాశచెందలేరు. ఇలా రైడింగ్ లో 26, ట్యాకిల్స్  లో  12, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో 1 మొత్తం 42 పాయింట్లు సాధించి విజయాన్ని అందుకుంది. 

బెంగళూరు బుల్స్ విషయానికి వస్తే స్టార్ రైడర్ పవన్ కుమార్ 19 పాయింట్లతో చెలరేగినా పలితం లేకుండా పోయింది. అలాగే సుమిత్ 7, సురభ్ 3 పాయింట్లతో తమ జట్టును గెలిపించుకోడానికి ప్రయత్నించారు. కానీ స్థానిక జట్టు ముందు వీరి ఆటలు సాగలేవు. రైడింగ్ లో 29, ట్యాకిల్స్ లో 7, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో 3 మొత్తం 40 పాయింట్ల వద్దే ఆ జట్టు ఆట ముగిసింది. ఇలా 42-40  పాయింట్ల తేడాతో ఓటమిపాలయ్యింది.