బీడబ్యూఎఫ్ కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ 500 టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ పారుపల్లి  కశ్యప్ పోరాటం ముగిసింది. వరుస విజయాలతో సెమీఫైనల్ వరకు చేరుకున్న అతడు పతకానికి అడుగు దూరంలో నిలిచిపోయాడు. సెమీస్ లో జపాన్ కు చెందిన నెంబర్ వన్, రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ కెంటో మొమొట చేతిలో కశ్యప్  ఓటమిపాలయ్యాడు. దీంతో అతడు ఈ టోర్ని నుండి వైదొలిగాడు. 

సెమీఫైనల్ పోరులో దూకుడుగా ఆడిన కెంటో వరుస సెట్లను గెలుచుకున్నాడు. కశ్యప్ అతడిపై ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేసినా దాన్ని అతడు సమర్థవంతంగా అడ్డుకోగలిగాడు. దీంతో 21-13,21-15 తో పూర్తి ఆధిపత్యాన్ని కరబర్చిన కెంటో ఫైనల్ కు అర్హత సాధించాడు. దీంతో ఈ టోర్నీ ఆరంభంనుండి అదరగొడుతూ పతకంపై ఆశలు రేకెత్తించిన కశ్యప్ కేవలం ఒక్క అడుగు దూరంలో దాన్ని మిస్సయ్యాడు. 

వరల్డ్ నెంబర్ వన్ షట్లర్ ను ఎదుర్కోడంలో కశ్యప్ చూపించిన పోరాటపటిమను అభినందించకుండా వుండలేం. అతడు ఓ వైపు ప్రత్యర్థి  వరుసగా పాయింట్లు సాధిస్తున్నా ఏమాత్రం నిరుత్సాహపడకుండా  గెలుపే లక్ష్యంగా చివరివరకు పోరాడాడు. కానీ వరల్డ్ ఛాంపియన్ ముందు నిలవలేక ఓటమిని చవిచూశాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు వీరిద్దరి మధ్య మ్యాచ్ జరగ్గా అన్నిట్లోనూ కెంటోనే విజయం సాధించాడు. 

శుక్రవారం జరిగిన క్వార్టర్స్ లో డైన్మార్క్ క్రీడాకారుడు  జార్గెన్‌సన్ ను 24-22,21-8 వరుస సెట్లలో ఓడించి కశ్యప్ సైమీస్ లో అడుగుపెట్టాడు. అంతకుముందు  కూడా అతడు మొదటి రౌండ్లో చైనీస్‌ తైపీ షట్లర్  లూ-ఛియా-హంగ్‌ పై గెలుపొందాడు.  21-16,21-16 వరుస సెట్లలో పైచేయి సాధించి సునాయాసంగా విజయాన్ని అందుకున్నాడు.  ఆ తర్వాత  రెండో రౌండ్లో మలేషియా షట్లర్ లూయీ డారెన్ పై కశ్యప్ 21-17,11-21,21-12  తేడాతో గెలుపుపొందాడు. ఇలా క్వార్టర్స్ లో   విజయకేతనం ఎగరేసినప్పటికి సెమీఫైనల్లో మాత్రం పరాజయాన్ని చవిచూశాడు. 

ఈ కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆరంభంలోనే భారత బృందానికి ఎదురుదెబ్బ తగిలింది. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ షట్లర్లరిద్దరూ నిరాశపర్చారు.  భారీ అంచనాలతో బరిలోకి దిగిన పివి సింధు, సైనా నెహ్వాల్ లు తొలి రౌండ్ నుండే వెనుదిరిగారు. ఇలా వారు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చినా కశ్యప్ ఒక్కడే  సెమీస్ వరకు చేరుకున్నాడు. 

సంబంధిత వార్తలు

కొరియా ఓపెన్ లో కశ్యప్ హవా...సెమీఫైనల్ కి అర్హత

 కొరియా ఓపెన్ లో కశ్యప్ దూకుడు... క్వార్టర్స్ కు అర్హత

కొరియా ఓపెన్... సింధు, సైనా ఇంటికి... కశ్యప్ ఒక్కడే..